Exit polls Resluts: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆప్, బీజేపీ స్పందనిదే..
ABN , Publish Date - Feb 05 , 2025 | 08:46 PM
దాదాపు అన్ని సర్వే సంస్థలు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమల వికాసం తథ్యమని అంచన వేయగా, ఆప్-బీజేపీ మధ్య పోటీ నువ్వా-నేనా అనే రీతిలో ఉంటుందని ఒక సర్వే సంస్థ పేర్కొంది. దీనిపై ఆప్, బీజేపీ సూటిగా స్పందించాయి.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలున్నాయో చెబుతూ 'ఎగ్జిట్ పోల్స్' (Exit polls) అంచనాలు వెలువడటంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ (BJP) స్పందించాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమల వికాసం తథ్యమని అంచన వేయగా, ఆప్-బీజేపీ మధ్య పోటీ నువ్వా-నేనా అనే రీతిలో ఉంటుందని ఒక సర్వే సంస్థ పేర్కొంది. దీనిపై ఆప్, బీజేపీ సూటిగా స్పందించాయి. ఆప్ పనితీరును పోల్‌స్టర్లు ఎప్పుడూ తక్కువగా అంచనా వేస్తుంటారని, వాస్తవ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగానే ఉంటాయని ఆప్ పేర్కొంది. మరోవైపు, ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ తేటతెల్లం చేశాయని బీజేపీ స్పందించింది.
Delhi Exit Polls Survey : డిఫరెంట్‌గా కేకే సర్వే.. జాతీయ సంస్థల అంచనాలు తలకిందులవుతాయా?
చారిత్రక విజయం ఆప్‌దే..
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను 'ఆప్' జాతీయ ప్రతినిధి రీనా గుప్తా కొట్టివేశారు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్‌ను ఎగ్జిట్‌పోల్స్ ఎప్పుడూ తక్కువగానే అంచనా వేస్తుంటాయని, కానీ వాస్తవ ఫలితాల్లో పోల్‌స్టర్ల అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. 2013, 2015, 2020లోనూ చాలా తక్కువ సంఖ్యలో ఆప్‌కు సీట్లు అంచనా వేశారని, వాస్తవ ఫలితాల్లో గరిష్ట స్థాయిలో ఆప్ సీట్లు గెలుచుకుందని గుర్తు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో 'ఆప్'కు ఓటేశారని, ఆప్ చారిత్రక విజయం నమోదు చేసుకోనుందని, నాలుగోసారి అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవిని చేపట్టడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
మార్పును కోరుకున్న ప్రజలు: బీజేపీ
ఎగ్జిట్స్ పోల్స్ అంచనాలను స్వాగతిస్తున్నట్టు బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ చెప్పారు. బీజేపీని గెలిపించాలని, మార్పు కావాలని ఢిల్లీ ప్రజలు చాలాకాలం క్రితమే స్థిరనిశ్చయానికి వచ్చారని చెప్పారు. అవినీతి రహిత పాలనను ఢిల్లీవాసులు కోరుకుంటున్నారని, బీజేపీ కార్యకర్తలు సైతం అవినీతికి వ్యతిరేకంగా ఎంతో అంకితభావంతో ప్రచారం సాగించారని అన్నారు. ఆప్ అధికారం కోల్పోనుందని, 25 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం బీజేపీ కైవసం కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి.
ఇవి కూడా చదవండి..
Delhi Exit Polls: కమల వికాసం...ఎగ్జిట్ పోల్స్ జోస్యం
Delhi Elections 2025 : అడుగడునా బారికేడ్లు..ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.. ఢిల్లీ పోలీసులపై మంత్రి ఫైర్
Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. రాష్ట్రపతి నుంచి రాహుల్ వరకు ఓటేసిన ప్రముఖులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి