Kota : ఈ గ్రామంలో..నో కరెంట్.. నో మొబైల్ సిగ్నల్.. నో మ్యారేజ్..
ABN , Publish Date - Jan 28 , 2025 | 07:28 PM
కరెంటు లేదు.. మొబైల్ నెట్‌వర్క్ లేదు.. ఇదొక్కటేనా.. ఆ గ్రామంలోని అబ్బాయిలు పెళ్లే చేసుకోరు.. అందుకే ఈ ఊరి మరో పేరు బ్యాచిలర్స్ విలేజ్.. అందుకు కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఇది డిజిటల్ యుగం. అందరూ టెక్నాలజీతో పోటీపడుతూ దూసుకుపోతున్నారు. ఫోన్ చేతిలో లేకుండా ఎవరికీ క్షణం కూడా గడవదు. కాల్స్, ఛాటింగ్స్, షాపింగ్ ఇలా ప్రతి ఒక్కపనికీ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ చేతుల్లో లేకుండా ఎవరైనా కనిపిస్తేనే అందరికీ వింత. అందుకని సహజంగానే దేశంలోని మారుమూల గ్రామాలకూ మొబైల్ నెట్‌వర్క్ విస్తరించిందని అందరూ అనుకోవచ్చు. కానీ, ఓ గ్రామంలో ఇప్పటికీ మొబైల్ నెట్‌వర్క్ లేదు. ఇదొక్కటేనా.. దేశానికి స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఆ గ్రామంలో కరెంటు సదుపాయం లేదు. మరొక వింత ఏంటంటే..ఆ గ్రామంలోని అబ్బాయిలు పెళ్లే చేసుకోరు. కరెంటు, ఫోన్, భార్యా పిల్లలు ఇవేవి లేకుండా ఎందుకు గడుపుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ఈ తరం వారికి పట్టపగలే అయినా లైట్ ఉండాల్సిందే. ఫ్యాన్ తిరగడం క్షణం ఆగిపోయినా అస్సలు తట్టుకోలేరు. కరెంటు సదుపాయం లేకుండా ఒక రోజు మొత్తం ఉండటాన్ని ఊహించుకోవడమంటే వామ్మో మా వల్ల కాదు అనేస్తారు. అలాంటిది రాజస్థాన్ లాంటి ఎడారి రాష్ట్రంలో ఇవేవి లేకుండానే గడిపేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ సదుపాయాల సంగతి పక్కన పెడితే.. పెళ్లి అయితేనే జీవితానికి ఓ పరిపూర్ణత అని భావిస్తారు భారతదేశంలో. ఒంటరిగా తోడు లేకుండా ఎవరైనా కనిపిస్తే పెళ్లెప్పుడు అని అడగటం సహజం. అలాంటిది ఆ ఊర్లో ఒకరు కాదు. ఇద్దరు కాదు. గ్రామంలో ఉన్న అందరూ అబ్బాయిలు పెళ్లికి దూరంగా ఉండిపోయారు. ఇది తెలిసిన ప్రతి ఒక్కరూ ఇదేం వింత గ్రామమని విస్తుపోతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాహాలు జరుగుతున్నాయి. వందలాది మంది యువతీ యువకులు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. పల్లెలు, నగరాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా పెళ్లి వేడుకల సందడి. అయితే రాజస్థాన్‌లోని కోటాలో ఉన్న కొలిపురా గ్రామంలో మాత్రం పెళ్లిళ్ల వేడుకలే కనిపించవు. నేటికీ కరెంటు, మొబైల్ నెట్‌వర్క్ వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఈ గ్రామంలో పెళ్లి సంగీత్ సందడి వినిపించడం లేదు. సదుపాయాల్లేని కారణంగానే ఈ గ్రామంలోని అబ్బాయిల పెళ్లి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చక ఒంటరిగా మిగిలిపోతున్నారు.
టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండటం వల్ల..
కొలిపురా గ్రామం ముకుంద్రా టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. దీంతో అటవీ శాఖ కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులకు అనుమతించడం లేదు. ఈ కారణంగా గ్రామస్థులు తమ ఇష్టానుసారంగా మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ గ్రామానికి కరెంటు రాలేదు, మొబైల్ నెట్‌వర్క్ కూడా లేదు. పులుల పునరావాసం కోసం గ్రామం ఉద్దేశించడం వల్ల ఇక్కడి ప్రజలు ఇళ్లను నిర్మించలేరు లేదా పునర్నిర్మించలేరు.
చదువులు, పెళ్లిళ్లకు ఆటంకం..
ఈ డిజిటల్ యుగంలో సౌకర్యాలు లేకపోవడంతో పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేసుకునే యువకులకు సంక్షోభం ఏర్పడింది. యువకులకు పెళ్లి ప్రతిపాదనలు ఖరారు కావడం లేదు. అబ్బాయిల కుటుంబాలు పెళ్లి సంబంధాల కోసం ఎక్కడికెళ్లినా, "మా కూతురు కరెంటు, మొబైల్ నెట్‌వర్క్ లేని గ్రామంలో ఎలా ఉంటుంది?" అనే సమాధనమే వస్తోంది. ఇవి రెండూ నేటి కాలంలో ప్రధాన అవసరాలు కావడంతో తమ పిల్లలు పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్నారని, బంధువులు కూడా తమ వద్దకు రావడంలేదని గ్రామస్థులు వాపోతున్నారు.
విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ లేక పెరుగుతున్న సమస్యలు..
ముకుంద్రా టైగర్ రిజర్వ్‌లో ఉన్న కొలిపురా గ్రామంలో 500 కుటుంబాలకు పైనే నివసిస్తున్నారు. 5G నెట్‌వర్క్‌లు సజావుగా నడుస్తున్న డిజిటల్ యుగంలో ఇప్పుడు మొబైల్ నెట్‌వర్క్ లైఫ్‌లైన్‌తో సమానం. అయితే, పేరుకే ఇక్కడ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. కానీ, గ్రామంలోని ఒక ఫోన్ మాత్రమే రింగ్ అవుతుంది. ఇది కొన్నాళ్ల సమస్య కాదనే ఇక్కడి గ్రామస్థుల ఆవేదన. బిడ్డల భవిష్యత్ అంధకారం అయిపోతుందనే భయం మనసులో ఉన్నా పుట్టిన ఊరిపై మమకారంతో వేరే ప్రాంతానికి వెళ్లలేక కాలం వెళ్లదీస్తున్నారు.