Share News

Israel Gaza Attack: గట్టి షాక్.. గాజాలో దాడులు, కీలక కమాండర్ బషార్ థాబెట్ మృతి

ABN , Publish Date - Jul 21 , 2025 | 07:16 AM

గాజాలో రోజురోజుకు పరిస్థితి ఇంకా దిగజారుతోంది. తాజాగా జరిగిన వైమానిక దాడిలో హమాస్‌కు చెందిన ప్రముఖ కమాండర్ బషార్ థాబెట్ మృతి చెందాడు. ఈ దాడికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) అధికారికంగా వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో గాజా ప్రాంతం మరింత ఉద్రిక్తంగా మారింది.

Israel Gaza Attack: గట్టి షాక్.. గాజాలో దాడులు, కీలక కమాండర్ బషార్ థాబెట్ మృతి
Israel Gaza Attack

గాజాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా తయారైంది. తాజాగా గాజాలో జరిగిన లక్ష్యిత దాడిలో హమాస్‌కు చెందిన సీనియర్ కమాండర్ బషార్ థాబెట్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ధ్రువీకరించింది. ఈ దాడి హమాస్ ఆయుధ తయారీ కేంద్రాలు, భూగర్భ సొరంగాలను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ దాడుల్లో (Israel Gaza Attack) భాగంగా జరిగింది.

IDF ప్రకారం ఇజ్రాయెల్ వైమానిక దళం గాజాలో 75 లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసింది. వీటిలో సైనిక స్థావరాలు, హమాస్ సెల్ సైట్లు ఉన్నాయి. గాజాలో జరుగుతున్న తీవ్రమైన యుద్ధం నేపథ్యంలో మానవతా సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గత 24 గంటల్లో కనీసం 115 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 92 మంది సహాయం కోసం వచ్చినవారు కాగా, ఇద్దరు సివిల్ డిఫెన్స్ కార్యకర్తలు ఉన్నారు.


ఆకలితో 18 మంది మృతి

ఇజ్రాయెల్ చేస్తున్న నిరంతర దాడుల కారణంగా అక్కడి ప్రజలకు ఆహారం, నీరు, వైద్య సామాగ్రి లేక నానా కష్టాలు పడుతున్నారు. దీంతో గాజాలో కరవు పరిస్థితులు సంక్షోభ స్థాయికి చేరుకున్నాయని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొన్ని రోజుల్లో ఆకలితో 18 మంది మరణించారని వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం.. డీర్ ఎల్ బలాహ్ ప్రాంతంలో కరపత్రాలను విసిరి, పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరింది. అయితే, గాజాలో సురక్షిత ప్రాంతాలు దాదాపు లేవని నివాసితులు చెబుతున్నారు. వేలాది మంది తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రదేశాల కోసం వెతుకుతున్నారు.


ఈ దేశాల్లో నిరసనలు..

ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ ట్యూనిసియా, ఇరాక్, టర్కీ, లెబనాన్, మొరాకో వంటి దేశాల్లో నిరసనలు చెలరేగాయి. ఈ నిరసన కారులు గాజాలో జరుగుతున్న మానవతా విపత్తును ఖండిస్తూ, ఇజ్రాయెల్ ముట్టడిని అంతం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్, గాజాలో ఐక్యరాష్ట్ర సమితి హ్యూమానిటేరియన్ వ్యవహారాల కోఆర్డినేషన్ కార్యాలయం (OCHA) అధిపతికి వీసా పొడిగింపును నిరాకరించినట్లు ధ్రువీకరించారు.

ఈ నిర్ణయం, ఇజ్రాయెల్ దళాలు ఆకలిని ఆయుధంగా ఉపయోగిస్తున్నాయని ఐక్యరాష్ట్ర సమితి అధికారి పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్.. నీటి సరఫరాపై దాడులు చేస్తున్నాయని పాలస్తీనియన్లు పేర్కొన్నారు. ఇది ఇప్పటికే ఉన్న వారి కష్టాలను మరింత తీవ్రతరం చేస్తోంది. దీంతో గాజాలో మానవతా సంక్షోభం రోజురోజుకూ మరింత పెరుగుతోంది.


ఇవి కూడా చదవండి

ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 21 , 2025 | 08:01 AM