Share News

Elon Musk: అమెరికా పార్టీ

ABN , Publish Date - Jul 07 , 2025 | 01:38 AM

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అన్నంత పనీ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ రెండోసారి విజయం సాధించేందుకు తోడ్పడి, అదే ట్రంప్‌తో విభేదాలతో బయటికొచ్చిన మస్క్‌.. కొద్దిరోజులుగా చెబుతున్నట్టుగా అమెరికా పార్టీ పేరిట కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు.

Elon Musk: అమెరికా పార్టీ

అన్నట్టుగానే కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తున్నట్టు ప్రకటించిన ప్రపంచ కుబేరుడు

  • కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన మస్క్‌

  • ఇప్పుడున్న పార్టీలు చెత్త నిర్ణయాలతో దేశాన్ని దివాలా తీయిస్తున్నాయి

  • మూడింట రెండొంతుల మంది అమెరికన్లు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు

  • ప్రజలకు స్వేచ్ఛను తిరిగి అందిస్తా: మస్క్‌

వాషింగ్టన్‌, జూలై 6: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అన్నంత పనీ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ రెండోసారి విజయం సాధించేందుకు తోడ్పడి, అదే ట్రంప్‌తో విభేదాలతో బయటికొచ్చిన మస్క్‌.. కొద్దిరోజులుగా చెబుతున్నట్టుగా ‘అమెరికా పార్టీ’ పేరిట కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్‌’లో వరుసగా పోస్టులు పెట్టారు. అమెరికాలో ఇప్పుడున్న రెండు పెద్ద పార్టీలు డెమొక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదని.. ప్రజలు నిజమైన రాజకీయ మార్పును కోరుకుంటున్నారని మస్క్‌ పేర్కొన్నారు. ఇటీవల తాను నిర్వహించిన పోల్‌లో మూడింట రెండొంతుల మంది కొత్త పార్టీ అవసరమని తేల్చారని చెప్పారు. ‘‘మీ స్వేచ్ఛను తిరిగి మీకు అందజేసేందుకు ఈ రోజు అమెరికా పార్టీ ఏర్పాటైంది. చెత్త, పనికిరాని నిర్ణయాలతో మనదేశాన్ని దివాలా తీయించే పరిస్థితి నెలకొంది. మనం ఈ ఏక పార్టీ వ్యవస్థను తుత్తునీయులు చేయబోతున్నాం’’ అని మస్క్‌ పేర్కొన్నారు. అమెరికాలో నిజానికి రెండు పెద్ద రాజకీయ పార్టీలు ఉన్నా.. అవి ఒకే తీరులో పనిచేస్తున్నాయన్న ఉద్దేశంతో ఏక పార్టీ వ్యవస్థగా ఆయన అభివర్ణించారు.


ట్రంప్‌ను గెలిపించి.. విభేదించి..

వాస్తవానికి గత అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌కు మస్క్‌ గట్టి మద్దతుదారుగా నిలిచారు. ట్రంప్‌ గెలవడం కోసం ప్రచారం చేయడమేకాదు.. వందల కోట్ల డాలర్లు ఖర్చుపెట్టారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా గెలిచాక ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం కోసం ఏర్పాటు చేసిన ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (డోజ్‌)’కు ఎలాన్‌ మస్క్‌ చీఫ్‌గా కూడా వ్యవహరించారు. కానీ ట్రంప్‌ ప్రభుత్వం తలపెట్టిన ‘బిగ్‌ బ్యూటీఫుల్‌ యాక్ట్‌’ను మస్క్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తూ డోజ్‌ నుంచి బయటికి వచ్చారు. ఈ క్రమంలో ట్రంప్‌, మస్క్‌ మధ్య తీవ్ర విమర్శల యుద్ధం నడిచింది. ఒకదశలో మస్క్‌ను దేశం నుంచి గెంటివేయడానికి సిద్ధమన్నట్టుగా కూడా ట్రంప్‌ మాట్లాడారు. ఈ క్రమంలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతానని మస్క్‌ చెబుతూ వచ్చారు. తాజాగా ‘అమెరికా పార్టీ’ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. అయితే పార్టీకి సంబంధించి ఎలాంటి వివరాలనూ మస్క్‌ వెల్లడించలేదు. కొత్త పార్టీ పెట్టాలంటే అమెరికా ఫెడరల్‌ ఎన్నికల కమిషన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇటీవలికాలంలో ఎన్నికల కమిషన్‌కు వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కడా అమెరికా పార్టీ పేరిట దరఖాస్తు లేదని సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ పేర్కొంది.


ట్రంప్‌కు దెబ్బపడుతుందా?

ఎలాన్‌ మస్క్‌ కొత్త రాజకీయ పార్టీతో రిపబ్లికన్‌ పార్టీకి, ట్రంప్‌కు దెబ్బతగులుతుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెక్నాలజీని ఎక్కువగా వినియోగించే యువతతోపాటు పలు వర్గాల ఓటర్లలో మస్క్‌కు మద్దతు ఉంది. దానికి తోడు ట్రంప్‌ వ్యతిరేకులు, తటస్థ ఓటర్లు మస్క్‌ పార్టీ వైపు చూస్తే... రిపబ్లికన్‌ పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో డెమొక్రటిక్‌ పార్టీకి సెనేట్‌, ప్రతినిధుల సభల్లో ప్రాతినిధ్యం తగ్గితే.. బలమైన ప్రతిపక్షం లేకుండా పోతుందని, ఇది ట్రంప్‌కు కలిసి వస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


కొత్త పార్టీ.. అంత సులువేం కాదు!

అమెరికా రాజకీయ విధానం చాలా వరకు రెండు పార్టీల వ్యవస్థకే అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు గ్రీన్‌ పార్టీ, లిబర్టేరియన్‌ పార్టీ వంటివి వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మస్క్‌కు ఎంత ప్రతిష్ఠ, సంపద ఉన్నా కొత్త పార్టీ అంత సులువుకాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇక అమెరికాలో పుట్టినవారికి మాత్రమే అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశం ఉంటుంది. మస్క్‌ దక్షిణాఫ్రికాలో జన్మించారు కాబట్టి తన పార్టీ ప్రజల్లో మద్దతు పొందినా కూడా మస్క్‌ అధ్యక్షుడు అయ్యే అవకాశమే లేదు. నిజానికి మస్క్‌ వ్యూహాలు కూడా భిన్నంగా ఉన్నాయి. గతంలో పలుమార్లు ఆయన చెప్పిన అంశాల మేరకు.. అమెరికా చట్టసభలైన సెనేట్‌, ప్రతినిధుల సభల్లో కొన్ని సీట్లను మస్క్‌ పార్టీ గెలుచుకుంటే చాలు. ఏవైనా బిల్లులను వ్యతిరేకించేందుకు, ఆమోదించేందుకు ఆ బలం సరిపోతుందని ఆయన ఆలోచన.

Updated Date - Jul 07 , 2025 | 01:38 AM