Musk Vs Trump: మస్క్, ట్రంప్ వివాదంలో కొత్త మలుపు.. డిలీట్ చేసిన ట్వీట్ ఏంటి?
ABN , Publish Date - Jun 07 , 2025 | 05:14 PM
Donald Trump-Elon Musk: ఎలాన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్ మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. డోజ్ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి మస్క్ అగ్రరాజ్య అధ్యక్షుడిపై నేరుగానే విమర్శల దాడికి దిగాడు. అయితే తాజాగా టెస్లా అధినేత అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఎక్స్ వేదికగా కొన్ని ట్వీట్లను డిలీట్ చేశాడు. ఇలా ఎందుకు చేశాడంటే..

Elon Musk Deletes Epstein Tweets: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య వివాదానికి బ్రేక్ పడ్డట్టే కనిపిస్తోంది. డోజ్ పదవి నుంచి తప్పుకున్న నాటి నుంచి అమెరికా ప్రభుత్వంపై వరస విమర్శలు చేస్తూ ట్రంప్ తో కయ్యానికి కాలు దువ్విన మస్క్.. తాజాగా కాస్త వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం , జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైళ్లలో డొనాల్డ్ ట్రంప్ పేరు ఉందని.. అందుకే ఆ ఫైళ్లను బహిరంగపరచడం లేదని ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇంకా అనేక అంశాలపై స్పేస్ ఎక్స్ అధినేత తీవ్ర విమర్శలు గుప్పించారు. కానీ, ఇప్పుడు పాత ట్వీట్లతో పాటు ట్రంప్ పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు సంబంధించిన అనేక పోస్టులను ఎక్స్ ఖాతా నుంచి తొలగించారు.
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ట్రంప్ (Donald Trump) , టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య స్నేహబంధం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మస్క్ కు ప్రభుత్వంలో కీలక బాధ్యత కట్టబెట్టడం, ట్రంప్ నిర్ణయాలు ఇలా ప్రతి ఒక్కటీ సంచలనమే. కానీ, కొన్ని నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు చెలరేగాయనే వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే డోజ్ పదవీ బాధ్యతల నుంచి వైదొలిగిన మస్క్ నేరుగా ట్రంప్ పైనే విమర్శల బాణం ఎక్కుపెట్టాడు.
డోజ్ పదవిలో ఉండగానే ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిపుల్ బిల్ ను వ్యతిరేకించిన మస్క్ తర్వాత వరస వ్యతిరేక పోస్టులతో చెలరేగిపోయాడు. కొన్ని గంటల క్రితం అతిపెద్ద బాంబు పేలాల్సిన సమయం ఆసన్నమైందని సంచలన పోస్ట్ చేశారు. లైంగిక వేధింపుల నిందితుడు జెఫ్రీ ఎప్ స్టీన్ కేసులో డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఉందని.. అందుకే ఆయన పేరు బహిరంగపరచలేదని సంచలన ఆరోపణలు చేశాడు. అదే విధంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ఎక్స్ వేదికగా ఓటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ‘ది అమెరికా పార్టీ’ అంటూ ఆయన చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. అయితే, తాజాగా ట్రంప్ కు వ్యతిరేకంగా చేసిన అనేక పోస్టులను డిలీట్ చేశారు టెస్లా అధినేత.
ఏంటీ జెఫ్రీ ఎప్స్టీన్ కేసు?
అమెరికాలో అత్యంత చర్చనీయాంశమైన లైంగిక అక్రమ రవాణా కేసుల్లో జెఫ్రీ ఎప్స్టీన్ కేసు ఒకటి. 2019లో ఎప్స్టీన్ పై లైంగిక దోపిడీ, మైనర్ బాలికల అక్రమ రవాణా ఆరోపణలు వచ్చాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల కోసం మైనర్ బాలికలను ఏర్పాటు చేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. కాగా, ఎప్స్టీన్ 2019లో జైలులో మరణించాడు. దీన్ని ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారణ చేశారు. అయితే, ఈ సంవత్సరం ఆ కేసుకు సంబంధించిన కొన్ని ఫైళ్లు బహిరంగంగా ప్రచురించారు. ఇందులో చాలా మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. నిజానికి, ఆ లిస్ట్ లో డొనాల్డ్ ట్రంప్ పేరు లేదు. కానీ, ట్రంప్ పేరు ఉందని మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని పత్రాలు ఇప్పటికీ బహిర్గతం కాలేదని, వాటిలో ట్రంప్ పేరు ఉండవచ్చని ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో పేర్కొన్నారు.
ఎండ్ కార్డ్ పడ్డట్టేనా?
ఎలాన్ మస్క్ పోస్ట్ తర్వాత ట్రంప్‌కు ఈ విషయంతో నిజంగా ఏదైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు ప్రజల మనస్సుల్లో తలెత్తుతున్నాయి. కచ్చితమైన ఆధారాలు లేకుండా టెస్లా అధినేత ఇలాంటి ప్రకటన చేయడం బాధ్యతారాహిత్యమని కూడా కొందరు తప్పుబడుతున్నారు. కానీ, ఈ పోస్టును కొన్ని గంటల అనంతరం మస్క్ స్వయంగా తొలగించాడు. దీంతో ట్రంప్, మస్క్ మధ్య వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లే అని అంతా భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో మస్క్, ట్రంప్ మధ్య సంబంధాలు క్షీణించాయి. కొంతకాలం క్రితం వరకు అమెరికా ప్రభుత్వంలో డోజ్ పదవిలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన మస్క్.. పన్ను బిల్లుపై విభేదాల తర్వాత రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మస్క్ తన నమ్మకాన్ని వమ్ము చేశారని ట్రంప్ ఆరోపించగా.. నేను లేకపోతే 2024 ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉండేవాడు కాదని స్పేస్ ఎక్స్ అధినేత బదులిచ్చారు. ఇదిలా ఉంటే, అమెరికన్ ఫండ్ మేనేజర్ బిల్ అక్మాన్ అభ్యర్థన వల్లే మస్క్ పోస్టులు డిలీట్ చేయడానికి కారణమని తెలుస్తోంది. మీరిద్దరూ విడిగా ఉండటం కంటే కలిసి ఉంటేనే బలంగా ఉంటామని బిల్ అక్మాన్ పోస్ట్ పెట్టగా.. మస్క్ మీరు చెప్పింది తప్పుకాదని రిప్లై ఇచ్చారు. ఆ తర్వాతే పోస్టులను తొలగించడంతో ఇరువురి మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.