Donald Trump Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్ వీడియో వైరల్
ABN , Publish Date - Jul 21 , 2025 | 09:45 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు ప్లాన్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఓ సంచలన వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) గురించి తన ట్రూత్ సోషల్ మీడియాలో సంచలన వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒబామాను ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఓవల్ ఆఫీస్‌లో అరెస్ట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో మొదట అనేక మంది అమెరికా రాజకీయ నాయకులు ఎవరూ చట్టానికి అతీతులు కాదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఒబామాను ఇద్దరు ఎఫ్‌బీఐ ఏజెంట్లు సంకెళ్లు వేసి అరెస్ట్ చేస్తున్నట్లుగా ఉంది. ఆ క్రమంలో ట్రంప్ అక్కడే కూర్చుని నవ్వుతూ కనిపిస్తున్నారు.
ట్రంప్ చర్యలు..
చివరగా ఒబామా జైలు లోపల నారింజ రంగు ఖైదీ దుస్తులు ధరించి నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఆ వీడియో మాత్రం నిజమైనది కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో క్రియేట్ చేసిన వీడియో. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ట్రంప్ ఈ వీడియోను పోస్ట్ చేసి ఒబామాను లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ట్రంప్ చర్యలు రాజకీయ ఉద్దేశాలతో చేసినవని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు కారణం ఇదేనా..
గత వారం అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ ఓ సంచలన ప్రకటన చేశారు. 2016 ఎన్నికల తర్వాత ట్రంప్-రష్యా కుట్ర సిద్ధాంతాన్ని ఒబామా మాజీ అధికారులు తయారు చేశారని, ట్రంప్ అధ్యక్ష పదవిని అడ్డుకునేందుకు ఈ కుట్ర జరిగిందని ఆమె అన్నారు. దీనికి ఆధారాలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒబామా పరిపాలనపై విచారణ జరపాలన్నారు.
2016లో ఇంటెలిజెన్స్‌ను రాజకీయం చేసి, ఆయుధంగా మార్చిన విధానాన్ని అమెరికన్లు చివరకు తెలుసుకుంటారని వెల్లడించారు. ఒబామా పరిపాలనలో.. డొనాల్డ్ ట్రంప్‌పై కొన్ని సంవత్సరాల పాటు తిరుగుబాటుకు పునాది వేశారని, ఇది అమెరికా ప్రజల ఇష్టాన్ని అణచివేసి, మన ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను బలహీనపరిచిందని ఆమె ఎక్స్‌లో రాసుకొచ్చారు.
ట్రంప్ తీరుపై..
ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ODNI)దీనిపై 114 పేజీల డాక్యుమెంట్‌ను కూడా విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్‌లో 2016 నవంబర్ ఎన్నికలకు ముందు, రష్యా.. సైబర్ మార్గాల ద్వారా ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదని ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ స్థిరంగా అంచనా వేసినట్లు తెలిపింది.
అలాగే, డిసెంబర్ 8, 2016న ప్రెసిడెంట్ డైలీ బ్రీఫ్ డ్రాఫ్ట్‌లో రష్యా అమెరికా ఎన్నికల మౌలిక సదుపాయాలపై సైబర్ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా ఇటీవలి అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేదని పేర్కొంది. దీంతో ట్రంప్ ఈ చర్యలు, ఆరోపణలు రాజకీయ ఉద్దేశంతో చేసినవని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒబామా పరిపాలనపై గబ్బర్డ్ ఆరోపణలు మరింత దర్యాప్తును డిమాండ్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి