Share News

Ishiba Alliance: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి.. ప్రధాని పదవి కోల్పోతారా..

ABN , Publish Date - Jul 21 , 2025 | 08:20 AM

జపాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి శిగేరు ఇషిబా నేతృత్వంలోని అధికార కూటమి, తాజా ఎగువ సభ ఎన్నికల్లో తీవ్ర పరాజయం చవిచూసింది. అసలు ఎందుకు ఓడిపోయారు, ఏంటనే విశేషాలను ఇక్కడ చూద్దాం.

Ishiba Alliance: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి.. ప్రధాని పదవి కోల్పోతారా..
Ishiba Alliance

జపాన్ రాజకీయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రధానమంత్రి శిగేరు ఇషిబా నేతృత్వంలోని అధికార కూటమికి (Ishiba Alliance) ఆదివారం జరిగిన కీలకమైన పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 248 సీట్లు ఉన్న జపాన్ ఎగువ సభలో సాధారణ మెజారిటీ (125 సీట్లు) సాధించడంలో ఇషిబా కూటమి విఫలమైంది. ఈ ఫలితం జపాన్‌లో రాజకీయ అస్థిరతను మరింత తీవ్రతరం చేసింది. 1955లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) స్థాపన తర్వాత, రెండు సభల్లోనూ మెజారిటీ కోల్పోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.


కూటమి కేవలం..

ఇషిబా నేతృత్వంలోని LDP, దీని భాగస్వామి అయిన కోమెయిటో పార్టీ కలిసి కనీసం 50 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ, రెండు సీట్లు మాత్రమే ఫలితం తేలకుండా ఉండగా, కూటమి కేవలం 46 సీట్లు మాత్రమే సాధించింది. ఈ ఓటమి ఇషిబాకు పెద్ద షాకింగ్ అని చెప్పవచ్చు. అక్టోబర్‌లో జరిగిన దిగువ సభ ఎన్నికల్లో కూడా ఇషిబా కూటమి ఓడిపోయింది. అయినప్పటికీ, ఇషిబా తన నాయకత్వాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు జపాన్ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని స్పష్టం చేస్తున్నాయి.


పెరిగిన ధరలు..

జపాన్‎లో ప్రధానంగా బియ్యం సహా అనేక ఆహార పదార్థాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఆర్థిక సమస్యలు ఎన్నికల ప్రచారంలో కీలక అంశంగా మారాయి. ప్రజలు తమ జీవన వ్యయాన్ని తగ్గించే పరిష్కారాలను కోరుకుంటున్నారు. ఇదే సమయంలో జపాన్‌లో సాన్సెయిటో పార్టీ ప్రజాదరణ పెంచుకుంటోంది. విదేశీ వ్యతిరేక వైఖరి, సాంప్రదాయ లింగ భావనలకు మద్దతు ఇస్తూ, ఈ ఎన్నికల్లో 16 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఇది గతంలో కేవలం ఒక సీటు మాత్రమే ఉన్న ఈ పార్టీకి పెద్ద విజయమని చెప్పవచ్చు.


అంతర్జాతీయంగా కూడా...

మరోవైపు అంతర్జాతీయంగా, ఇషిబా ప్రభుత్వం మరిన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం, జపాన్‌తో వాణిజ్య చర్చల్లో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టులో అమలులోకి రానున్న 25% దిగుమతి సుంకం జపాన్‌పై మరింత ఒత్తిడిని పెంచింది. LDP ఇప్పటికీ ఎగువ సభలో అతిపెద్ద పార్టీగా 38 సీట్లతో నిలిచింది. కానీ, ఆర్థిక, రాజకీయ సవాళ్ల మధ్య ఇషిబా తన కూటమిని కాపాడుకోవడం కష్టంగా మారింది.


పదవి కోల్పోయారా..

ప్రతిపక్ష పార్టీలైన కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (CDPJ), డెమోక్రటిక్ పార్టీ ఫర్ ది పీపుల్ (DPP) కొంత బలాన్ని సంపాదించాయి. ఈ క్రమంలో ప్రస్తుతానికి ఇషిబా ప్రధానమంత్రి పదవి కోల్పోలేదు. కానీ ఈ ఓటమి ఆయన నాయకత్వాన్ని మరింత బలహీనం చేసింది. జపాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి సహా అంతర్జాతీయ ఒత్తిళ్లతో కూడిన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇషిబా ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి మరి.


ఇవి కూడా చదవండి

ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 21 , 2025 | 09:30 AM