Canada Gun Fire: కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థిని మృతి
ABN , Publish Date - Apr 19 , 2025 | 09:59 AM
కెనడా హామిల్టన్‌లోని మోహాక్ కళాశాలలో చదువుకుంటున్న హర్‌సిమ్రత్ రంధవా (21) అనే విద్యార్థిని బుధవారం స్థానిక బస్టాప్ వద్ద వేచి చూస్తోంది. అదే సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

కెనడాలో దారణ ఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు కాల్పులకు తెగబడడంతో భారతీయ విద్యార్థిని మృతి చెందింది. విద్యార్థిని మృతి పట్ల టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ శుక్రవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాల్పుల ఘటనలో విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం విచారకరమని, మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. వివరాల్లోకి వెళితే..
కెనడాలోలోని ఒంటారియోలోని (Ontario in Canada) హామిల్టన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హామిల్టన్‌లోని మోహాక్ కళాశాలలో చదువుకుంటున్న హర్‌సిమ్రత్ రంధవా (21) అనే విద్యార్థిని బుధవారం స్థానిక బస్టాప్ వద్ద వేచి చూస్తోంది. అదే సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు కారులో అటుగా వచ్చి.. బస్టాప్ వద్ద ఆగి ఉన్న ఇంకో వాహనంపైకి (Gun fire) కాల్పులు జరిపాడు.
అయితే ఆ బుల్లెట్ పొరపాటున అక్కడే ఉన్న విద్యార్థినికి తగిలింది. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రక్తపుమడుగులో ఉన్న హర్‌సిమ్రత్‌ను చికిత్స నిమిత్తం ఆస్సత్రికి తరలించారు. అయితే అప్పటికే (Indian student dies) ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన అనంతరం అక్కడున్న రెండు వాహనాలు అదృశ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.
కాగా, కెనడాలో భారతీయులతో పాటూ, హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతుండడంపై ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కెనడాలో ఓ భారతీయుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా విద్యార్థిని ఇలా కాల్పుల్లో మరణించడం అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.