Pakistan Floods: ఆకస్మిక వరదలు.. కళ్ల ముందే 18 మంది గల్లంతు.. వీడియో వైరల్..
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:27 PM
పాకిస్తాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల దాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే పెద్ద పెద్ద నదులన్నీ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరి గుండెల్నీ పిండేస్తోంది..

పాకిస్తాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల దాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే పెద్ద పెద్ద నదులన్నీ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరి గుండెల్నీ పిండేస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కళ్ల ముందే ఒకే కుటుంబానికి చెందిన 18 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసిన వారంతా.. అయ్యో.. ఎంత ఘోరం జరిగింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పాకిస్థాన్‌లోని (Pakistan) ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రాంతంలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో స్థానిక స్వాత్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అదే సమయంలో ఈ ప్రాంతానికి పర్యటన నిమిత్తం వచ్చిన కుటుంబం.. నది మధ్యలో ఉండగా విషాద ఘటన చోటు చేసుకుంది. వరద పోటెత్తడంతో నది నుంచి బయటికి వచ్చే అవకాశం లేక.. ఎత్తుగా ఉన్న ప్రాంతం పైకి వెళ్లారు.
అయితే కాసేపటికే వరద మరింత పెరగడంతో చూస్తుండగానే ఒక్కొక్కరుగా కొట్టుకుపోయారు. దూరంగా ఒడ్డున చాలా మంది ఉన్నా కూడా వారిని కాపాడే అవకాశం లేకుండా పోయింది. చివరకు ఒకే కుటుంబంలో (18 tourists washed away in floods) మొత్తం 18 మంది గల్లంతైనట్లు తెలిసింది. వారిలో 9 మంది మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మొత్తం 80 మంది రెస్క్యూ టీం సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
స్థానికుల సమాచారం మేరకు.. ఈ వరదలో ఇంకా చాలా మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా స్వాత్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతోంది. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు. వరదలపై ముందస్తు సమాచారం ఉన్నా కూడా.. జనాలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కెనడాపై ట్రంప్ ఆగ్రహం.. వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ప్రకటన
అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు భారీ విజయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి