Watermelon:పుచ్చకాయను భోజనానికి ముందు తినాలా.. తర్వాత తినాలా..
ABN , Publish Date - Apr 26 , 2025 | 09:08 AM
Best Time to Eat Watermelon: ఎండకాలంలో ప్రతిరోజూ పుచ్చకాయ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్న పూట భోజనానికి ముందు లేదా తర్వాత తింటుంటారు. ఇందులో ఏ పద్ధతి బెస్ట్ అనేది తెలుసుకోకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

Watermelon Before or After Meals: వేసవిలో భారీ ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తరచూ వచ్చే అవకాశముంది. వీటిని నిరోధించేందుకు ఈ సీజన్లో పుచ్చకాయ తింటూ ఉంటారు. ఈ పండులో 90% వరకు నీరే ఉంటుంది. డీహైడ్రేషన్ నుంచి రక్షించుకునేందుకు ఇదొక అద్భుతమైన ఆహారం. ఎండాకాలంలో ప్రతిరోజూ పుచ్చకాయ తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వదు. తలతిరుగుడు లేదా బలహీనత వచ్చే అవకాశాలు తగ్గుతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం లేదా అజీర్ణం వంటి సమస్యలు రావు. పుచ్చకాయను రోజులో ఒక్కో సమయంలో తింటే వేర్వేరు ప్రయోజనాలు కలుగుతాయి. ఇక దీన్ని ఏ సమయంలో తింటే మంచిదని చాలామంది మనసులో మెదిలే ప్రశ్న. ముఖ్యంగా ఆహారం తినే ముందా లేదా తిన్న తర్వాత అని తెలియాలంటే ఇది చదవండి.
సరైన సమయం ఏది?
పుచ్చకాయ తినడానికి ఉత్తమ సమయం ఉదయం. ఖాళీ కడుపుతో అల్పాహారంగా తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. భోజనానికి ఒక గంట ముందు పుచ్చకాయను కూడా తినవచ్చు. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థను పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలను నివారించవచ్చు. శరీరంలోని ఎలక్ట్రోలైట్లు, నీటి కొరత తీరుస్తుంది కాబట్టి వ్యాయామం చేసిన తర్వాత కూడా తినవచ్చు. వేసవిలో మధ్యాహ్నం పుచ్చకాయను తింటే శరీరంలోని వేడి తగ్గిపోయి చల్లబడుతుంది.
భోజనానికి ముందా లేదా తర్వాతా?
పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఆహారం తీసుకునే ముందు పుచ్చకాయ తింటే కడుపు ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. అదనపు కేలరీలు తీసుకోకుండా ఉంటారు. మరో విషయం ఏంటంటే ఇందులో నీరు ఎక్కువగా ఉన్నా అరుగుదల అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. కాబట్టి, భోజనానికి ముందే తీసుకుంటే ప్రయోజనాలు మెండుగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
పుచ్చకాయ ఎప్పుడు తినకూడదు?
రాత్రిపూట పుచ్చకాయ తినకూడదు. ఎందుకంటే అందులో నీరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, నిద్రపోయే సమయంలో తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే భోజనం తిన్న వెంటనే పుచ్చకాయ తినకూడదు. ఎందుకంటే ఇది గ్యాస్, జీర్ణ సమస్యలను పెంచుతుంది. ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఉదయం పూట తినడం వల్ల శరీరం తాజాగా ఉంటుంది. అయితే, ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే పుచ్చకాయను తినకూడదు. ఇది గొంతు, జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది.
బరువు తగ్గాలంటే
బరువు తగ్గాలనుకునేవారు మధ్యాహ్నం పుచ్చకాయ తినాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా కడుపు ఎక్కువసేపు నిండినట్లుగానే ఉండి ఆకలిగా అనిపించదు. ఇందులో కేలరీలు తక్కువే. వేసవిలో ప్రతిరోజూ పుచ్చకాయను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. బరువు తగ్గడం సులభం అవుతుంది.
ఈ పండ్లతో పుచ్చకాయ తినకండి..
పుచ్చకాయను వేడి చేసే పండ్లతో కలిపి తినకూడదు. ఎందుకంటే అప్పుడు కడుపుని చికాకుకు గురై జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. చలువ చేసే స్వభావం ఉంటుంది కాబట్టి పుచ్చకాయను ఇతర పండ్లతో కలిపి తినకూడదు. ముఖ్యంగా అరటి, నారింజ, ద్రాక్షలతో పుచ్చకాయను అస్సలు తినకూడదు. వీటితో పుచ్చకాయ తినడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్ణం, అసిడిటీ ఏర్పడతాయి. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారికి పుచ్చకాయ సరిపడదు. కాబట్టి కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాకే తినాలో..వద్దో.. నిర్ణయించుకోండి.
Read Also: Dry Fruits: మీరు డ్రై ఫ్రూట్స్ తింటుంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..
Kumkuma Puvvu: ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు నీళ్లు తాగవచ్చా..