Night Sweats: రాత్రిళ్లు ఒళ్లంతా చెమట తడిపేస్తోందా? ఈ వ్యాధి లక్షణమే కావచ్చు.. జాగ్రత్త..
ABN , Publish Date - Jul 22 , 2025 | 08:59 AM
వేడి వాతావరణం లేనప్పటికీ రాత్రి పూట ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంటే తస్మాత్ జాగ్రత్త. రాత్రుళ్లు అకారణంగా చెమట తేలికగా తీసుకోకండి. కేవలం శరీరంలో వేడి పెరగడం వల్లే ఇలా జరగదు. అందుకు ఈ వ్యాధి కూడా కారణం కావచ్చు.

వాతావరణంలో వేడి పెరిగినప్పుడు లేదా వేసవి కాలంలో చెమట పట్టడం అనేది సహజం. వ్యాయామం లేదా ఏదైనా బరువులెత్తే పనులు చేసినప్పుడు అలసటతో ఒళ్లంతా చెమట కారిపోతుంటుంది. కొన్ని సార్లు శరీరంలో వేడి అధికం కావడం వల్ల కూడా చెమట పడుతుంది. కానీ, స్పష్టమైన కారణం లేకుండా పదే పదే ఇదే సమస్య రిపీట్ అవుతుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కూడా కావచ్చు. రాత్రుళ్లు అకారణంగా చెమట పడుతుంటే హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెక్షన్, మానసిక ఒత్తిడి లేదా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల లక్షణాలు కూడా కావచ్చు. అందువల్ల రాత్రిపూట చెమటలు పట్టడం కేవలం వాతావరణ ప్రభావం మాత్రమే కాదుయ కొన్నిసార్లు ఇది శరీరం నుంచి వచ్చే హెచ్చరిక. దీనిని విస్మరించడం హానికరం అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
సాధారణ గది ఉష్ణోగ్రతలో నిద్రిస్తున్నా నిద్రపోయేటప్పుడు పక్క తడిసిపోతుంటే తేలికగా తీసుకోకండి. ఇదే సమస్య పదే పదే పునరావృతమవుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది గుప్త వ్యాధికి సంకేతం కావచ్చు. ఎందుకంటే సమస్యను ముందుగా గుర్తిస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.
ఇన్ఫెక్షన్ లేదా TB సంకేతం
ఎటువంటి కారణం లేకుండా రాత్రిపూట పదే పదే చెమటలు పట్టడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం లేదా నిరంతర జ్వరం ఉంటే అది TB (క్షయ) సంకేతం కావచ్చు. ఇది TB రోగులలో ఒక సాధారణ లక్షణం. దీనితో పాటు HIV, మలేరియా, బ్రూసెల్లోసిస్ వంటి ఇన్ఫెక్షన్లు కూడా రాత్రిపూట చెమటలు పట్టడానికి కారణం కావచ్చు.
హార్మోన్ల మార్పులు
తరచుగా హార్మోన్ల అసమతుల్యత వల్ల రాత్రిపూట చెమటలు పడతాయి. ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ వచ్చే ముందు లేదా రుతుక్రమం ఆగిపోయే సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలలో వచ్చే మార్పులు చెమట పట్టడానికి కారణమవుతాయి. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గినప్పుడు పురుషులకు కూడా రాత్రిపూట చెమటలు పట్టవచ్చు. థైరాయిడ్ వంటి ఎండోక్రైన్ సమస్యలు ఈ లక్షణాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి.
మానసిక ఒత్తిడి, మందుల ప్రభావం
మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ కూడా రాత్రిపూట చెమటలు పట్టడానికి ప్రధాన కారణాలు కావచ్చు. ఆందోళన కారణంగా శరీరంలోని నాడీ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. దీనివల్ల రాత్రిపూట చెమట పడుతుంది. దీనితో పాటు కొన్ని యాంటిడిప్రెసెంట్స్, జ్వరాన్ని తగ్గించే మందులు కూడా శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేసి చెమట పట్టేందుకు కారణమవుతాయి.
వరసగా కొన్ని రోజులపాటు రాత్రుళ్లు చెమట పడుతున్నా, అలసట, జ్వరం, బరువు తగ్గడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్స పొందాలి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
నిద్రపోతున్నప్పుడు కూడా శరీరం కేలరీలు బర్న్ చేస్తుందా?
పైల్స్ నుండి ఉపశమనం పొందడానికి ఏమి తినాలో తెలుసా?