Indians Abroad: సింగపూర్ ఎయిర్‌పోర్టులో భారతీయుల రచ్చ.. పరువు తీసేశారంటూ జనాల ఆగ్రహం
ABN , Publish Date - Jul 22 , 2025 | 07:31 AM
సింగపూర్‌లో కొందరు భారతీయులు అనుచితంగా ప్రవర్తించారంటూ ముంబై వ్యక్తి ఒకరు పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. భారతీయుల అందరి పరువూ తీసేలా ప్రవర్తించారంటూ ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: ముంబైకి చెందిన ఓ వ్యక్తి సింగపూర్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. మనోళ్ల ప్రవర్తన తలవంపులు తెచ్చేలా ఉందంటూ అతడు పెట్టిన పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. భారతీయులకు పౌర స్పృహ తక్కువంటూ మండిపడుతున్నారు.
సింగపూర్‌లోని ఛాంగీ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగినట్టు ఆ ముంబై వ్యక్తి చెప్పుకొచ్చారు. సింగపూర్‌లో 20 మంది సభ్యులున్న ఓ భారతీయ బృందం రచ్చ రచ్చ చేసిందని అన్నారు. చుట్టూ ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా గట్టిగా మాట్లాడుతూ రచ్చ రచ్చ చేశారని అన్నారు. ఎయిర్‌పోర్టు అంతా తమదే అన్నట్టు పెద్దగా నవ్వుకుంటూ అమర్యాదకరంగా ప్రవర్తించారని తెలిపారు.
కొందరు ఎయిర్‌పోర్టులో నేలపై కూర్చుండిపోయారని చెప్పారు. వీరి రచ్చపై ఇతర ప్రయాణికుల దృష్టి పడిందని, వారంతా భారతీయ బృందంపై ఛీత్కారంగా చూశారని అన్నారు. ఇంత జరుగుతున్నా కానీ వారేమీ లెక్క చేయకుండా ఇష్టారీతిన వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సాటి భారతీయుడిగా తనను ఇది బాగా ప్రభావితం చేసిందని ఆ వ్యక్తి అన్నారు. అవమానకరంగా అనిపించిందని చెప్పారు. కొందరి ప్రవర్తన కారణంగా భారతీయులంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని అన్నారు.
ఇక ఈ ఉదంతంపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని అన్నారు. చాలా చోట్ల భారతీయులు గట్టిగా మాట్లాడుతూ అందరి దృష్టిలో పరువు పోగొట్టుకుంటున్నారని చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఉన్న భారతీయులు సాటి వారికి తలవంపులు తెచ్చేలా వ్యవహరించకూడదని కొందరు హితవు పలికారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
రైల్లో చిరు వ్యాపారి నుంచి జ్యూస్ ప్యాకెట్ చోరీ.. ఏం సంస్కారం రా నాయనా..
క్యాన్సర్‌తో మరణం అంచున యువతి.. మిగిలిన టైంలో ఏం చేయాలో చెప్పాలంటూ పోస్టు