Blood Pressure: రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతే వెంటనే ఇలా చేయండి..
ABN , Publish Date - May 19 , 2025 | 08:20 AM
Low Blood Pressure Remedies: అధిక రక్తపోటుతో పోలిస్తే తక్కువ రక్తపోటు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హఠాత్తుగా బీపీ డౌన్ అయినప్పుడు రక్తపోటు వెంటనే సాధారణ స్థితికి వచ్చేందుకు ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవండి.

How To Manage Low BP: అధిక రక్తపోటు వల్ల శరీరంలో రక్తప్రసరణ వేగంగా అయి హైపర్ టెన్షన్ వస్తుంది. అదే లో బీపీ ఉంటే శరీరంలోని అవయవాలకు రక్త ప్రసరణ తగ్గిపోయి ఆయా భాగాలన్నీ చచ్చుబడిపోయినట్లుగా అయిపోతాయి. ముఖ్యంగా మెదడు ఒక్కసారిగా మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా హఠాత్తుగా రక్తపోటు పడిపోయిన సందర్భాల్లో ప్రాణానికే ప్రమాదకరంగా మారవచ్చు. అంతేకాదు.. లో బీపీ వల్ల అనేక సమస్యలు చుట్టుముడతాయి. నేటి బిజీ జీవితం, చెడు జీవనశైలితో పాటు శరీరంలోని పోషకాహార లోపం కూడా తక్కువ రక్తపోటుకు కారణం కావచ్చు. తక్కువ రక్తపోటు తీవ్రమైన వ్యాధి కానప్పటికీ సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం వల్ల ప్రాణాంతకంగా మారుతుంది. రక్తపోటు 90/60 లేదా అంతకంటే తక్కువకు చేరుకున్నప్పుడుఏ లక్షణాలు కనిపిస్తాయి? అలాంటి సమయాల్లో ఏం చేయాలో తెలుసుకుందాం.
తక్కువ రక్తపోటు లక్షణాలు
శరీరంలో రక్తపోటు తక్కువగా ఉండటం వల్ల తలతిరగటం, అలసట, నీరసం లేదా ఎక్కువగా నిద్ర వస్తున్నట్లు అనిపించడం, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, విపరీతంగా చెమట పట్టడం, సాధారణ ఉష్ణోగ్రత వద్ద కూడా చలిగా అనిపించడం, హృదయ స్పందన వేగంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
లో బీపీ నివారణా చిట్కాలు
తక్కువ రక్తపోటు సమస్య తరచుగా వస్తుంటే నీరు తాగుతూ ఉండండి. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడానికి నీరు సహాయపడుతుంది. దీనివల్ల లో బీపీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
రక్తపోటు అకస్మాత్తుగా తగ్గితే చక్కెర, ఉప్పు కలిపిన నీటిని తాగండి. ఇలా చేయడం వల్ల రక్తపోటు వెంటనే అదుపులోకి వచ్చి శరీరం యాక్టివ్‌గా మారుతుంది.
లో బీపీ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా తగినంతసేపు నిద్రపోవాలి. విశ్రాంతిగా గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.
రక్తపోటు తక్కువగా ఉంటే నిర్లక్ష్యంగా ఉండకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
కాఫీ సేవించడం వల్ల కూడా లో బీపీ సమస్యను అధిగమించవచ్చు. బ్లాక్ కాఫీ తాగితే వెంటనే రక్తపోటును సాధారణ స్థితికి వస్తుంది.
తక్కువ రక్తపోటు ఉన్నవారు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సోడియం అధికంగా ఉండే ఆహారాలను కచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలి.
అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రమే కాకుండా తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయాలి.