Lemon Water Acidity Link: ప్రతిరోజూ లెమన్ జ్యూస్ తాగితే అసిడిటీ వస్తుందా?
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:54 PM
నిమ్మకాయ నీటిని సహజ ఆరోగ్య పానీయంగా పరిగణిస్తారు. బరువు తగ్గాలన్నా.. ఫిట్‌గా ఉండాలన్నా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో లెమన్ జ్యూస్ తాగితే మంచిదని సోషల్ మీడియా లేదా ఫిట్‌నెస్ నిపుణులు అంటుంటారు. అందుకే ఈ ట్రెండ్ ఇటీవల బాగా పెరిగిపోయింది. కానీ, రోజూ లెమన్ జ్యూస్ తాగే అలవాటు ఆరోగ్యానికి చేటు చేసే అవకాశమూ ఉంది.

నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. అలసిన శరీరానికి తక్షణమే శక్తినిచ్చే సహజ పానీయాల్లో ఇది ప్రధానమైనది. బరువు తగ్గాలన్నా.. ఫిట్‌గా ఉండాలన్నా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో లెమన్ జ్యూస్ తాగితే మంచిదని సోషల్ మీడియా లేదా ఫిట్‌నెస్ నిపుణులు అంటుంటారు. శరీరంలోని డీటాక్సిన్లను తరిమికొట్టి చర్మాన్ని మిలమిల మెరిసిపోయేలా చేసే 'మ్యాజికల్ డ్రింక్' అని ముద్దుగా పిలుస్తారు. అద్భుత ప్రయోజనాలున్న ఈ జ్యూస్ రోజూ తాగితే ఆరోగ్యం మీ సొంతమని ఊదరగొట్టేస్తుంటారు. అందుకే ఈ మధ్యకాలంలో ఉదయం నిద్ర మేల్కొన్న వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగే ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. కానీ, ఈ అలవాటు కొంతమందికి హానికరంగా మారుతుందంటే నమ్ముతారా?
ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. నేటికాలంలో ఏ సందేహం కలిగినా సోషల్ మీడియా వైపే చూస్తు్న్నారు అంతా. ఆరోగ్య చిట్కాలను సొంతంగా పాటిస్తున్నారు. మన శరీరానికి సరిపడుతుందా? లేదా? అని ఆలోచించకుండానే ఆచరణలో పెట్టేస్తున్నారు. అలాంటి వాటిలో రోజూ నిమ్మకాయ నీరు తాగే అలవాటు ఒకటి. సిట్రస్ జాతికి చెందిన నిమ్మలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఆమ్ల గుణాలు అధికం. ఇవి శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, సరైన పద్ధతిలో నిమ్మను తీసుకోకపోతే శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
నిమ్మరసం జీర్ణక్రియకు మంచిదని భావిస్తారు. నిమ్మకాయ నీరు తాగడం వల్ల సాధారణంగా అసిడిటీ కలగదు. ఇది రుచిలో పుల్లగా ఉంటుందనేది నిజమే. కానీ, శరీరం లోపల జీర్ణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇది ఆమ్ల స్వభావం కోల్పోతుంది. శరీర జీవక్రియ నిమ్మకాయ ప్రాథమిక స్వభావాన్ని మారుస్తుంది. అయితే, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉంటే నిమ్మకాయ నీరు అసిడిటీ సమస్యను మరింత పెంచుతుంది. ఇలాంటివారు మొదట జీర్ణవ్యవస్థను బలోపేతం చేసుకోవడం పైన దృష్టిపెట్టాలి. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను నయం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
అసిడిటీ సమస్య తరచుగా నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఉదయం ఆలస్యంగా అల్పాహారం తీసుకోవడం, ఎక్కువసేపు ఆకలితో ఉండటం, సరిగ్గా నమలకుండా తినడం, ఖాళీ కడుపుతో టీ, కాఫీ లేదా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అసిడిటీ వస్తుంది. ముందుగా ఈ విషయాలన్నింటిలోనూ ప్రతిఒక్కరూ శ్రద్ధ వహించాలి. తిన్న తర్వాత పది నిమిషాలు నడవడం వల్ల అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read:
నానబెట్టిన ఎండుద్రాక్ష నీరు.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.!
భోజనం చేసిన వెంటనే ధూమపానం.. ఇలా చేస్తే రిస్క్‌లో పడ్డట్టే..
For More Health News