Share News

UPI Credit Line: యూపీఐ క్రెడిట్ లైన్ గురించి విన్నారా.. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:29 PM

యూపీఐ యూజర్లు అత్యవసర సందర్భాల్లో రుణం పొందే మార్గం అందుబాటులో ఉంది. మరి ఈ ఫీచర్ ఏంటో, దీన్ని ఎలా వినియోగించుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.

UPI Credit Line: యూపీఐ క్రెడిట్ లైన్ గురించి విన్నారా.. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
UPI credit line

ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ రాకతో చెల్లింపులు సులభతరం అయ్యాయి. అయితే, యూపీఐ క్రెడిట్ లైన్‌తో సులభంగా రుణం పొందే అవకాశం కూడా ఉంది. యూజర్లు తమ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్‌ల నుంచి ఈ క్రెడిట్ లైన్ ద్వారా రుణాన్ని తీసుకోవచ్చు. అచ్చు బ్యాంక్ అకౌంట్‌ నుంచి డబ్బు తీసుకున్నట్టు ఉండే ఈ ఫీచర్‌ ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (UPI Credit Line).

యూపీఐ క్రెడిట్‌ లైన్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. క్రెడిట్ కార్డులు, ఇతర సంప్రదాయక రుణాలు అందుబాటులో లేని వారి కోసం దీన్ని ప్రారంభించింది. యూపీఐ క్రెడిట్ లైన్ అంటే యూపీఐ యూజర్లకు బ్యాంకులు ఇచ్చే ప్రీ అప్రూవ్డ్ లోన్. అయితే, ఈ లోన్ మొత్తం ఒక్కసారిగా కాకుండా అవసరమైన మేరకు యూజర్లు వినియోగించుకునేలా ఈ సేవను అందుబాటులోకి తెచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదీ క్రెడిట్ కార్డు లాంటిదే. కాకపోతే ఇందులో ప్లాస్టిక్ కార్డుల వంటివేవీ ఉండవు. యూజర్ల యూపీఐ ఐడీతో ఈ క్రెడిట్ లైన్ అకౌంట్ నేరుగా అనుసంధానం అయ్యి ఉంటుంది. ఫిన్ టెక్ సంస్థలు అందించే బై నౌ, పే లేటర్‌ కంటే యూపీఐ క్రెడిట్ లైన్ భిన్నమైనదని నిపుణులు చెబుతున్నారు.


యూపీఐ క్రెడిట్ లైన్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ప్రస్తుతం హెడ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు లాంటి కొన్ని సంస్థలే ఈ ఫీచర్‌ను ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులోకి తెచ్చాయి. ఈ ఫీచర్ కావాలనుకునేవారికి మంచి క్రెడిట్ స్కోరు అవసరం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఆయా బ్యాంక్‌ల యాప్‌లు లేదా యూపీఐ యాప్‌లో తెలుసుకోవచ్చు. ఈ క్రెడిట్ లైన్‌కు మీకు అర్హత ఉన్నట్టైతే లోన్ జారీ కోసం ఓ డిజిటల్ ఫార్మ్ నింపాల్సి ఉంటుంది. బ్యాంకు అమోదం పొందాక యూపీఐ క్రెడిట్ లైన్ ఇతర బ్యాంక్ అకౌంట్స్ లాగా యూపీఐ యాప్‌లో కనిపిస్తుంది. ఇందులోంచి అవసరమైన మేరకు డబ్బును వినియోగించుకోవచ్చు.

ఇక ఈ అకౌంట్‌ నుంచి వాడుకున్న మొత్తానికే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రుణంపై విధించే వడ్డీ మాత్రం ఆయా బ్యాంకుల రీపేమెంట్‌ వ్యవధిని బట్టి ఉంటుంది. స్వల్ప వ్యవధిపై తీసుకునే రుణాలకు కొన్ని బ్యాంకులు ఎలాంటి వడ్డీ వసూలు చేయవని నిపుణులు చెబుతున్నారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి యూపీఐ క్రెడిట్ లైన్ అద్భుతంగా ఉపయోగపడుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. యూపీఐ క్రెడిట్ లైన్‌ అంటే అత్యవసర సందర్భాల్లో అందుబాటులో ఉండే రుణమని వ్యాఖ్యానిస్తున్నారు.


ఆర్‌బీఐ ఇటీవల జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం, ఇకపై ఎఫ్‌డీ, బంగారం, ప్రాపర్టీ, షేర్స్ బాండ్స్, కిసాన్ క్రెడిట్ కార్డు ఆధారిత లోన్‌ అకౌంట్‌లను యూజర్లు నేరుగా యూపీఐకి లింక్ చేసుకోవచ్చు. ఆ తరువాత ఈ అకౌంట్స్‌ను నగదు ఉపసంహరణ (రోజుకు రూ.10 వేలు వరకూ) నగదు బదిలీ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కొనుగోళ్లకు వినియోగించుకోవచ్చు. ఆగస్టు 31 నుంచి యూజర్లు తమ రుణ అకౌంట్‌లను యూపీఐకి లింక్ చేయొచ్చు. అయితే, సంబంధిత బ్యాంకు కూడా ఇందుకు అంగీకరించాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి:

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

Read Latest and Business News

Updated Date - Jul 20 , 2025 | 03:42 PM