Heart Diseases : ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. గుండె ధమనులు మూసుకుపోతే ఏమవుతుంది..
ABN , Publish Date - Mar 09 , 2025 | 04:06 PM
Symptoms Heart Diseases:ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారికీ ఏదొక సమయంలో అనుకోకుండా గుండె కొట్టుకోవడం ఆగిపోతోంది. నిజానికి ఇది హఠాత్తుగా జరిగిందని చాలా మంది అనుకుంటారు. కానీ, అది తప్పు. గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని తెలిపేందుకు ముందుగానే మన శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Heart Blockage Symptoms : మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన సమస్యలలో గుండె జబ్బులు ఒకటి. ఏ వ్యక్తిలో అయినా గుండె సమస్యలు రావడానికి ప్రధాన కారణం గుండె ధమనులు మూసుకుపోవడం. మ గుండె ధమనులు మూసుకుపోతే (ఇది కొరోనరీ ఆర్టరీ వ్యాధిగా కూడా పిలుస్తారు) రక్త ప్రవాహం సరిగ్గా జరగదు. ఇది గుండెపోటుకు దారితీయవచ్చు. అయితే, మనం కొన్ని సంకేతాలను ముందుగానే గుర్తిస్తే సమయానికి జాగ్రత్తలు తీసుకుని గుండెల్లో సమస్యలు తలెత్తకుండా కాపాడుకోవచ్చు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా నివారించవచ్చు.
గుండె ధమనులు మూసుకుపోతున్నాయని సూచించే 7 ముఖ్యమైన సంకేతాలు :
ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి:
గుండె ధమనులు బ్లాక్ అయ్యాయని చెప్పేందుకు ప్రధాన సంకేతం ఛాతీలో నొప్పి లేదా గట్టిగా పట్టుకున్నట్లుగా అనిపించడం. కొందరికి ఇది వ్యాయామం చేసినప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది. కొన్నిసార్లు విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా నొప్పి రావచ్చు. అయితే, నొప్పి ఎక్కువసేపు ఉంటే లేదా తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:
ధమనులు మూసుకుపోయినప్పుడు గుండెకు సరిపడినంత రక్తం, ఆక్సిజన్ సరఫరా కాదు. నడిచినా చిన్న పని చేసినా కూడా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. మీకు తరచూ శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంటే దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
విపరీతమైన అలసట:
ఎక్కువ పని చేయకుండానే అలసిపోవడం లేదా బలహీనంగా అనిపించడం కూడా గుండె సమస్యల సూచన కావచ్చు. గుండె ధమనులు బ్లాక్ అయితే శరీరంలోని అవయవాలకు సరైన రక్తప్రవాహం ఉండదు. దీంతో తేలికపాటి పనులు చేసినా అలసట వేస్తుంది.
తలతిరుగుడు లేదా మూర్ఛ:
గుండె రక్తాన్ని బాగా పంప్ చేయలేకపోతే మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. దీని వల్ల తలతిరుగుడు, కంగారు, అస్వస్థత, మూర్ఛ వచ్చే అవకాశం ఉంటుంది.
గుండె వేగంగా లేదా తక్కువగా కొట్టుకోవడం:
గుండె సాధారణంగా కొట్టుకోవాలి. కానీ, ఒకేసారి గట్టిగా, వేగంగా లేదా అసాధారణంగా కొట్టుకుంటే అది గుండె సమస్యలకు సంకేతంగా భావించాలి. గుండె ధమనులు మూసుకుపోయి రక్తప్రవాహం తగ్గినప్పుడే ఇలా అవుతుంది.
శరీరంలోని ఇతర భాగాల్లో నొప్పి:
గుండె సమస్య వల్ల ఛాతి మాత్రమే కాదు. చేతులు, భుజాలు, మెడ, దవడ, వీపు వంటి ఇతర భాగాల్లో కూడా నొప్పి రావచ్చు. ఎక్కువగా ఇది ఎడమవైపు అనిపిస్తుంది కానీ కుడివైపుకూడా రావచ్చు.
అకస్మాత్తుగా చల్లగా చెమటలు పడటం:
ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా చెమటలు పడడం. ఒంటికి చలిగా అనిపించడం కూడా గుండె సమస్యకు సంకేతం కావచ్చు.
Read Also : కాళ్లల్లో ఈ మార్పులు గుండె జబ్బులకు సంకేతం
రాత్రి నిద్రపోలేకపోతున్నారా.. ఈ పండు హాయిగా నిద్రపోయేలా చేస్తుంది..
హోలీ రంగులతో చర్మానికి హాని కలగకూడదంటే.. ముందే ఇలా చేయండి..
మరిన్ని ఆరోగ్య, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..