Heatwave Alert: మే నెల వచ్చేసింది.. హీట్ వేవ్స్ వల్ల ఈ సమస్యలు.. జాగ్రత్త..
ABN , Publish Date - May 03 , 2025 | 08:53 AM
Health Issues Caused By Heatwaves: మేలో ఎండల తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకోవడంతో పాటు వేడి గాలులు హీటెక్కిస్తాయి. హీట్ వేవ్స్ ప్రభావంతో ఈ ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి, జాగ్రత్త..

Heatstroke Symptoms And Prevention: భారతదేశంలో మండు వేసవిలో తరచుగా భరించలేని వేడిగాలులు వీస్తాయి. ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారినే అధిక వేడి ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో శరీరం ఒత్తిడికి గురై బలహీనపడి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. మే నెలలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, కొన్నిరోజుల పాటు వేడిగాలుల తీవ్రత ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే ప్రజలను హెచ్చరించింది. కాబట్టి, వేసవిలో అధిక వేడి గాలుల వల్ల ప్రధానంగా ఈ 5 సమస్యలు రాకుండా చూసుకోండి.
హీట్ వేవ్స్ అంటే ఏమిటి?
వాతావరణంలో కొన్ని రోజుల నుంచి నెలల వరకు అసాధారణంగా వీచే వేడి గాలులను హీట్ వేవ్స్ అంటారు. హీట్ వేవ్స్ వల్ల వేడి, ఉక్కపోత తీవ్రమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నివసించేవారికి, తిరిగేవారికి అనారోగ్య సమస్యలు దాడి చేసే అవకాశముంది.
వడదెబ్బ
వేసవిలో మధ్యాహ్నపు ఎండలో ఎక్కువగా తిరిగితే వడదెబ్బ వస్తుందని తెలిసిందే. వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి వడదెబ్బ తీవ్రత ఉంటుంది. బలహీనంగా ఉన్న వారు వడదెబ్బకు గురైతే ప్రాణాలు పోయినా ఆశ్చర్యం లేదు. ముఖ్యంలో ఉష్ణోగ్రత 104°F (40°C) దాటినప్పుడు శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేదు. దీంతో వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాంతకం కావచ్చు.
అలసట
వేడి వల్ల వచ్చే అలసట చిన్న సమస్యలాగా అనిపించవచ్చు కానీ తీవ్రమైనది. చెమట ద్వారా శరీరం నీరు, ఉప్పు అధికంగా కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంది. సాధారణంగా తీవ్రమైన వేడి పరిస్థితులలో శారీరక శ్రమ చేసినా లేదా వ్యాయామం చేసినా ఈ సమస్య రావచ్చు.
నిర్జలీకరణం
తీవ్రమైన వేడిలో శరీరం నీటిని వేగంగా కోల్పోతుంది. వీటిని వెంటనే భర్తీ చేయకపోతే డీహైడ్రేషన్ సమస్య తలెత్తుంది. దీని వలన అలసట, తలనొప్పి, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గడం, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన నిర్జలీకరణం అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది చాలా ప్రమాదకరం.
తిమ్మిరి
తీవ్రమైన వేడి పరిస్థితులలో శారీరకంగా ఎక్కువ కష్టపడినప్పుడు చేసినప్పుడు కండరాల నొప్పులు తీవ్రంగా బాధిస్తాయి. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, అధిక చెమట కారణంగా శరీరం వేగంగా ద్రవాలను కోల్పోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. సాధారణంగా కడుపు, చేతులు లేదా కాళ్ళలోని కండరాలు తిమ్మిరిగా ఉన్నట్టు అనిపిస్తాయి.
చర్మ సమస్యలు
ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల వడదెబ్బ తగలవచ్చు. అతినీలలోహిత (UV) కిరణాల నేరుగా చర్మాన్ని తాకడం వల్ల ఇలా జరుగుతుంది. తీవ్రమైన వడదెబ్బ వల్ల చర్మం నల్లబడటమే కాదు. ఊడిపోయి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కాలక్రమేణా చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
Read Also: Healthy Breakfast Ideas: ఉదయం నిద్రలేవగానే ఆకలిగా అనిపిస్తోందా.. బెస్ట్ ఫుడ్ ఐడియాస్ మీకోసం..\
Anger Issues: మీకు కోపం ఎక్కువగా వస్తుందా.. తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటారు..
Diabetes: వేసవిలో షుగర్ పేషెంట్లు గ్లూకోజ్ పౌడర్ వాడవచ్చా..