Share News

Hair Tips : ఇలా చేస్తే.. కర్లీ హెయిర్ చిక్కుపడదు..స్మూత్‌గా మారుతుంది..

ABN , Publish Date - Jan 20 , 2025 | 05:39 PM

కర్లీ హెయిర్ ఉన్నవాళ్లు చిక్కు తీసుకోవడం కష్టమై నచ్చిన స్టైల్ చేసుకోలేక ఇబ్బందిపడుతుంటారు. తరచూ సిల్కీ హెయిర్ కోసం స్ట్రైయిటనర్లు యూజ్ చేస్తుంటారు. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే జుట్టు గడ్డిలా మారిపోయి రాలిపోయే ప్రమాదముంది. కాబట్టి, ఈ చిన్నపాటి చిట్కాలు ప్రయత్నిస్తే జుట్టు మృదువుగా మారి తళతళా మెరిసిపోతుంది. చిక్కు సమస్యా తీరుతుంది..

Hair Tips : ఇలా చేస్తే.. కర్లీ హెయిర్ చిక్కుపడదు..స్మూత్‌గా మారుతుంది..
How to Smooth Curly Hair Natural Tips

రింగుల జుట్టు ఉన్న చాలా మంది అమ్మాయిలు తమ జుట్టు చాలా త్వరగా చిక్కుపడిపోతుందని, గరుకుగా ఉండటం వల్ల చిక్కు విప్పడం చాలా కష్టమని, నచ్చిన స్టైల్ చేసుకోలేకపోతున్నామని కంప్లైంట్ చేస్తుంటారు. నిజానికి, కర్లీ హెయిర్ ఉన్నవాళ్లు సాదా జుట్టు ఉన్నవాళ్లతో పోలిస్తే ఇంకాస్త ఎక్కవ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. చిక్కు తీసుకోవడం చేతకాకే సగం జుట్టు ఊడిపోతుందని బాధపడేవాళ్లు ఈ సింపుల్ హెయిర్ కేర్ టిప్స్ ఫాలో అయితే చాలు. మీ జుట్టు స్మూత్‌గా మారి చిక్కు సమస్య తీరుతుంది. ఏ హెయిర్ స్టైల్ అయినా సులభంగా చేసుకోగలరు.


కర్లీ హెయిర్ ఉన్న వాళ్లు తలకు నూనె రాసుకున్నా జుట్టంతా పైకి రేగుతూనే ఉంటుంది. షాంపూ చేసుకున్న తర్వాత అయితే జుట్టంతా చిక్కులు పడి జడ వేసుకోవడం పెద్ద టాస్క్‌లా అనిపిస్తుంది. ఎక్కువ మంది వెంట్రుకలు ఎండు గడ్డిలా జీవం లేకుండా అయిపోతున్నాయని బాధపడుతుంటారు. స్ట్రెయిటనింగ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని పదే పదే చేస్తుంటారు. కొన్నాళ్ల తర్వాత జట్టు మరీ అధ్వాన్నంగా కనిపించడం మొదలవుతుంది.వెంట్రుకలు పెరిగేకొద్దీ వంకరటింకరగా మారతాయి. ఆర్టిఫిషియల్ పద్ధతిలో కాకుండా ఈ సహజ చిట్కాలను పాటిస్తే మీ జుట్టు తప్పకుండా మృదువుగా మారుతుంది. జుట్టును సహజంగా మృదువుగా ఉంచుకోవడానికి కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించండి.


షాంపూ చేసే ముందు ఇలా చేయండి..

మీ జుట్టు వంకరగా ఉండి హెయిర్ వాష్ తర్వాత చాలా గరుకుగా కనిపిస్తుందా. అయితే, మీ జుట్టును షాంపూ చేసే గంటన్నర ముందు నూనెతో బాగా మసాజ్ చేయాలి. ఇది జుట్టు తేమను కోల్పోకుండా సహాయపడుతుంది. మాయిశ్చరైజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్న షాంపూనే ఉపయోగించాలని గుర్తుంచుకోండి.


జుట్టుకు ఆవిరి పట్టండి..

హెయిర్ ఆయిల్‌తో మసాజ్ చేసిన తర్వాత జుట్టుకు ఆవిరి పట్టండి. ఈ ప్రాసెస్ మీ వెంట్రుకలను మృదువుగా మార్చడంతో పాటు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మాడుపై ఏర్పడిన చుండ్రును శుభ్రంచేసి హెయిర్ ఒత్తుగా పెరిగేందుకు హెల్ప్ అవుతుంది.


ప్రతిసారీ కండీషనర్ తప్పకుండా వాడండి..

రింగుల జుట్టు ఉంటే షాంపూ చేసిన తర్వాత ప్రతిసారీ నాణ్యమైన కండీషనర్‌ను అప్లై చేయండి. మీరు నేచురల్ హెయిర్ కండిషనింగ్ చేయాలనుకుంటే, అరటిపండును మెత్తగా చేసి అందులో పెరుగు మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత మళ్లీ ఒకసారి జుట్టు శుభ్రం చేసుకోండి.


ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది..

యాప్రికాచ్ నూనె గిరిజాల జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. నేరేడు గింజల నుంచి తయారైన ఈ నూనెను హిమాచల్‌లో చులీ నూనె అని పిలుస్తారు. ఈ నూనెతో జుట్టుకు మసాజ్ చేసుకుంటే మృదువుగా అయ్యేందుకు అత్యుత్తంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ నూనెకు ఎలాంటి వాసన ఉండదు. పూసినా ఎటువంటి సమస్యా రాదు.

Updated Date - Jan 20 , 2025 | 05:39 PM