Weight Loss : ఊబకాయాన్ని.. బీఎంఐతో కొలవడం సరికాదు..
ABN , Publish Date - Jan 15 , 2025 | 03:36 PM
స్థూలకాయాన్ని లెక్కగట్టేందుకు చాలా మంది ఫాలో అయ్యేది బాడీ మాస్ ఇండెక్స్. ఈ నంబరు ఆధారంగానే కచ్చితమైన బరువు మెయింటెయిన్ చేస్తున్నామా?లేదా? అనే నిర్ధారణకు వస్తారు. ఇది కరెక్ట్ కాదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కేవలం బీఎంఐ ఆధారంగా ఊబకాయం ఉందని అన్నిసార్లు చెప్పలేమని చెబుతున్నారు..

ఈ స్మార్ట్ ప్రపంచంలో శరీరాన్ని పెద్దగా కష్టపెట్టకుండానే అన్ని పనులు ఈజీగా చేసేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ నిత్యం ఫోన్లకే అతుక్కుపోతున్నారు. ఉన్న చోట నుంచి కదలకుండా పనిచేసే ఉద్యోగాలే ఎక్కువ. దీనికి తోడు ఈ ఫాస్ట్ యుగంలో తీరిక లేక పిజ్జాలు, బర్గర్లు, ఇన్‌స్టంట్ ఫుడ్,ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌కు బానిసలైపోతున్నారు అంతా. ఇంకేముంది, ఈ దెబ్బకు బాడీలో క్యాలరీలు ఖర్చవక ఎక్కడికక్కడ కొవ్వు పేరుకుపోయి ఊబకాయం వచ్చేస్తుంది. తర్వాత తీరిగ్గా ఈ అధిక బరువు వదిలించుకోలేక జిమ్, యోగా అంటూ వర్కవుట్లు మొదలుపెట్టేస్తారు. అయితే, స్థూలకాయాన్ని లెక్కగట్టేందుకు చాలా మంది ఫాలో అయ్యేది బాడీ మాస్ ఇండెక్స్. ఈ నంబరు ఆధారంగానే కచ్చితమైన బరువు మెయింటెయిన్ చేస్తున్నామా?లేదా? అనే నిర్ధారణకు వస్తారు. ఇది కరెక్ట్ కాదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కేవలం బీఎంఐ ఆధారంగా ఊబకాయం ఉందని అన్నిసార్లు చెప్పలేమని చెబుతున్నారు..
రోజుకు ఎంత దూరం నడిచాం, పరిగెట్టాక ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి, ఎంతసేపు నిద్రపోయాం, హార్ట్‌బీట్ రేటు ఎలా ఉంది..ఇలాంటివన్నీస్మార్ట్ డివైజ్‌ల సాయంతోనే లెక్కిస్తున్నారు అంతా. వీటిలో అందరినీ హడలెత్తించేది బాడీ మాస్ ఇండెక్స్. మీ ఎత్తుకు ఎంత బరువుండాలో చెప్పే సూచిక ఇది. దీని ఆధారంగా సాధారణ రేటుకు మించి బరువు పెరిగితే ఒబెసిటీ వచ్చిందని నిశ్చయానికి వచ్చేస్తుంటారు అంతా. ఇది సరైనది కాదని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. శరీరంలో బరువు పెరిగన్నంత మాత్రాన ఊబకాయం వచ్చినట్లు కాదని పరిశోధకులు అంటున్నారు. బీఎంఐ నంబరు ఒక్కటే స్థూలకాయాన్ని నిర్ధారించే ప్రమాణం కాదని పేర్కొన్నారు.
బీఎంఐ నంబరుతో ఆరోగ్యాన్ని లింక్ చేయడం మానుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.ఎందుకంటే, బీఎంఐ శరీరంలో కొవ్వు శాతాన్ని లెక్కించలేదు. బరువును మాత్రమే కొలుస్తుంది. కొవ్వు, కండకు తేడా గుర్తించలేదు. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఏదని కనిపెట్టలేదు. అందుకే పొట్ట, నడుము భాగాల్లో పేరుకుపోయిన కొవ్వులపై దృష్టి సారించాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నడుము, ఎత్తుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటే ఊబకాయాన్ని నిర్ధారించవచ్చు. నడుము, ఎత్తుల నిష్పత్తి 0.5 కన్నా ఎక్కువగా ఉండి, బీఎంఐ 25-30 ఉంటే గనక ఆ వ్యక్తికి ఊబకాయం ఉన్నట్లు పరిగణించాలని కొత్త విధానాన్ని సూచించారు.
ఉదాహరణకు యూరోపియన్ సంతతికి చెందిన వ్యక్తులకు 30 కంటే ఎక్కువ BMI ఉంటే స్థూలకాయంగా పరిగణించబడుతుంది. కానీ, వివిధ దేశాలకు BMI ప్రమాణం మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఊబకాయం వచ్చే ప్రమాదం ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. ఈ వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అంతర్జాతీయ నిపుణుల బృందం సూచిస్తోంది.