Share News

Heart Attack: చర్మంపై కనిపించే ఈ మార్పులు గుండెపోటుకు సంకేతాలు..

ABN , Publish Date - Jun 30 , 2025 | 07:31 PM

Heart Attack Symptoms: గుండె పోటు ఎప్పుడు మనపై దాడి చేస్తుందో తెలుసుకోవడం కష్టమని అనుకుంటాం. అందులో ఎంతో కొంత నిజం ఉన్నప్పటికీ.. చాలా సందర్భాల్లో కొన్ని ముందస్తు లక్షణాలు తప్పక కనిపిస్తాయి. ముఖ్యంగా చర్మంపై ఈ 5 సంకేతాలు..

Heart Attack: చర్మంపై కనిపించే ఈ మార్పులు గుండెపోటుకు సంకేతాలు..
Skin Signs of Heart Attack

Skin Signs of Heart Attack: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు హార్ట్ అటాక్ కారణమని మీకు తెలుసా? గుండెపోటు కేసులు ఏటికేడు పెరుగుతూ పోతున్నాయే తప్ప తగ్గట్లేదు. ఇప్పుడు వృద్ధులు.. యువతే కాదు.. ఊహతెలియని పసిపిల్లలు సైతం గుండె పోటు కాటుకు బలవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అసలు గుండె జబ్బుల ముప్పు ఎందుకిలా పెరిగిపోతుంది? అర్థాంతరంగా ప్రాణాలు ఎందుకు కబళిస్తోంది? అంటే సవాలక్ష కారణాలు. అయితే.. ఈ ప్రాణాంతక వ్యాధిని గుర్తించేందుకు చర్మంలో వచ్చే మార్పులపై కాస్త శ్రద్ధ వహిస్తే చాలు. ఈ ముప్పు నుంచి బయటపడవచ్చు. అవేంటో తెలుసుకుందాం..


చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరిగింది. ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. సాధారణంగా గుండెలో రక్త ప్రసరణ తగ్గి ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. అయితే, గుండెపోటు రాకముందే శరీరం హెచ్చరికలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. చాలా మంది దీనిని విస్మరిస్తారు. ఇది ప్రమాదకరమని గుర్తించలేరు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, గుండెపోటు సంకేతాలు శరీరంలోని అనేక భాగాలతో పాటు ముఖంపై కూడా కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు.


పసుపు-తెలుపు దద్దుర్లు

కళ్ళ దగ్గర మైనపు లాంటి చర్మం లేదా తెలుపు లేదా పసుపు రంగు దద్దుర్లు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనేందుకు ఇది సంకేతం. కొంతమంది కళ్ళలో ఈ చర్మం ఘనీభవించిన మైనంలా కనిపిస్తుంది. కళ్ళతో పాటు అరచేతులు, కాళ్ళ వెనుక కూడా అలాంటి దద్దుర్లు కనిపించవచ్చు. ఈ సూచన తర్వాత కూడా మీరు కొలెస్ట్రాల్‌ను నియంత్రించలేకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం రెట్టింపవుతుంది.

చర్మంపై నీలం లేదా ఊదా రంగు గుర్తులు

శరీరంలోని ఏదో ఒక భాగంలో అకస్మాత్తుగా చర్మం రంగు మారితే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది మీ అనారోగ్యకరమైన గుండెకు సంకేతం. ఈ లక్షణాలు ఎక్కువగా నీలం లేదా ఊదా రంగులో కనిపిస్తాయి. పాదాలు, అరికాళ్ళపై కూడా ఈ మార్పు కనిపిస్తుంది. చర్మంపై నీలం లేదా ఊదా రంగు మచ్చ ఉంటే మీ శరీరంలో లేదా ఏదైనా నిర్దిష్ట అవయవంలో రక్తం గడ్డకట్టిందని, తగినంత ఆక్సిజన్ అందడం లేదని అర్థం. ధమనులలో రక్తం పేరుకుపోవడం వల్ల ధమనులలో మూసుకుపోతాయి. ఇది గుండెపోటుకు కారణమవుతుంది.


గోళ్ళ కింద నీలం లేదా ఊదా రంగు గుర్తులు

గోళ్ళ కింద అకస్మాత్తుగా నీలం లేదా ఊదా రంగు మచ్చలు కనిపించడం ప్రారంభిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. గోళ్ళపై అలాంటి గుర్తులు గుండె జబ్బులకు సంకేతం కావచ్చు. గాయం కారణంగా కూడా అలాంటి గుర్తులు కనిపించవచ్చు. కానీ గాయం ఏదీ లేకపోయినా ఈ లక్షణం కనిపిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.

పసుపు రంగు గడ్డలు

చర్మం కింద కొవ్వు పేరుకుపోవడం వల్ల కళ్లు, మోచేతులు లేదా మోకాళ్లపై చిన్న చిన్న పసుపు, ఆరెంజ్ రంగులో ఉండే గడ్డలు కనిపిస్తాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం. రక్తనాళాలు మూసుకుపోతున్నాయని చెప్పే వార్నింగ్ ఇది. కాబట్టి, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.


అరచేతులు, అరికాళ్లపై మచ్చలు

అరచేతులు లేదా అరికాళ్లపై ఉన్నట్టుండి నొప్పి, గోధుమ రంగు మచ్చలు లేదా దురద లేని ముదురు ఎరుపు కనిపిస్తుంటే జాగ్రత్త. ఇవి గుండె ఇన్ఫెక్షన్‌ ఉందనేందుకు సూచిక. వీటిని ‘జానవే లీజన్స్’ అంటారు. సరైన సమయంలో ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే ఇవి గుండెను తీవ్రంగా దెబ్బతీస్తాయి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

ఈ 5 అలవాట్లు పాటిస్తే.. వయస్సు పెరిగినా అందం తగ్గదు..

చర్మం, పాదాలపై కనిపించే ఈ లక్షణాలు విటమిన్ డి లోపానికి సంకేతమా..

For More Health News

Updated Date - Jun 30 , 2025 | 08:00 PM