NPCI: త్వరలో UPI కొత్త ఫీచర్.. ఇకపై కంటిచూపుతోనే పేమెంట్స్..!
ABN , Publish Date - Jul 31 , 2025 | 09:21 AM
పాస్‌వర్డ్.. OTP.. PIN.. ఇలాంటివేవి అవసరం లేకుండా కేవలం కళ్లతో పేమెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పటివరకూ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే చూసిన ఈ అద్భుతం ఇకపై ఆచరణలోకి రాబోతోంది. కేవలం బయోమెట్రిక్స్, ఫేస్ ఐడీ, ఐరిస్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టేందుకు NPCI సన్నాహాలు చేస్తోంది.

Biometric UPI Payments: ప్రపంచ దేశాలతో పోలిస్తే డిజిటల్ చెల్లింపులు చేసే భారతీయుల సంఖ్య ఎక్కువ. యూపీఐ పేమెంట్స్ దేశ ఆర్థికవ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. త్వరలో మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టబోతోంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ). ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే UPI చెల్లింపుల కోసం పిన్ నమోదు చేయవలసిన అవసరం ఉండదు. యూజర్లు వారి ఫేస్ ID లేదా వేలిముద్రలు, ఐరిస్ (కనుపాప)ను ఉపయోగించి చెల్లింపులు చేయగలరు. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. మరికొన్ని నెలల్లో దీన్ని ప్రారంభించాలని NPCI భావిస్తోంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI లావాదేవీల్లో పిన్‌కు బదులుగా బయోమెట్రిక్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. అంటే QR కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత మీరు మీ వేలిముద్ర లేదా ముఖ గుర్తింపును ఉపయోగించి చెల్లింపులు చేయగలుగుతారు. ఇప్పటివరకు, UPI చెల్లింపుల కోసం 4 లేదా 6 అంకెల పిన్‌ను నమోదు చేయాల్సి వచ్చేది. కానీ, చాలా మంది తమ పిన్ నంబర్ తరచూ మర్చిపోతారు లేదా పిన్ ఎవరికైనా తెలిస్తే మోసం చేసే అవకాశమూ ఉంది. అదీగాక వృద్ధులకు లేదా సాంకేతికత గురించి అంతగా తెలియని వారికి పిన్‌ను నమోదు చేయడం కష్టంగా అనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికే బయోమెట్రిక్ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నారు.
పిన్‌కు బదులు బయోమెట్రిక్ అంటే వేలిముద్ర, ఫేస్ ఐడీ ఉపయోగించడం చాలా సులభం. సురక్షితం కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి వేలిముద్రలు, కంటిపాపలు ఎవరూ మ్యాచ్ చేయలేరు. మరో విషయం ఏంటంటే, బయోమెట్రిక్ ఫీచర్ వచ్చినప్పటికీ పిన్, ఫేస్ ఐడీ అందుబాటులో ఉంటాయి. యూజర్ తనకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. డిజిటల్ టెక్నాలజీ గురించి అవగాహన లేని గ్రామీణులు, వృద్ధులకు కొత్త ఫీచర్ వాడటం తేలిక అవుతుంది. కాగా, NPCI అధికారిక తేదీని ప్రకటించలేదు. కానీ నివేదికల ప్రకారం, ఈ ఫీచర్ పరీక్ష దశలో ఉంది. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రావచ్చు.
ఇవి కూడా చదవండి
వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
వారంలో టాప్ 6 కంపెనీల లాస్ రూ.78 వేల కోట్ల పైమాటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి