Credit Card Scam: 20 నిమిషాల్లో రూ.8.8 లక్షల దోపిడీ.. ఇలాంటి క్రెడిట్ కార్డు స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే..
ABN , Publish Date - Jul 31 , 2025 | 08:08 AM
కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల సైబర్ నేరగాళ్ల బారిన పడి 20 నిమిషాల్లో రూ.8.8 లక్షలు పోగొట్టుకున్నాడు. అతడు సిమ్ స్వాప్ స్కామ్ బారిన పడి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. మరి ఇలాంటి మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: అతడు తన క్రెడిట్ కార్డులు సేఫ్‌గా ఉన్నాయని అనుకున్నాడు. స్కామ్స్‌కు అవకాశమే లేదని భావించాడు. అప్పటివరకూ ఎటువంటి అనుమానాస్పద లావాదేవీలు కూడా కనిపించలేదు. ఆ తరువాత కథ ఊహించని మలుపు తిరిగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలో అతడు ఏకంగా రూ.8.8 లక్షలు నష్టపోయాడు. అతడి కార్డుల ద్వారా సైబర్ నేరగాళ్లు భారీగా ఆన్‌లైన్ కొనుగోళ్లకు తెగబడ్డారు. బాధితుడి ఫోన్‌కు వరుసగా ఓటీపీలు వస్తుంటే భయమేసి వెంటనే కార్డులను బ్లాక్ చేశాడు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. కోల్‌కతాకు చెందిన పంకజ్ కుమార్ ఇటీవల ఎదుర్కొన్న పరిస్థితి ఇది. అతడు సిమ్ స్వాప్ స్కాప్ బారిన పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏమిటీ సిమ్ స్వాప్ స్కామ్
ఇది ఒక డిజిటల్ ఐడెంటిటీ ఫ్రాడ్. అంటే.. సైబర్ నేరగాళ్లు బాధితుడి ఫోన్ నెంబర్‌ను తమ సిమ్‌కు మార్చుకుంటారు. ఆ తరువాత బాధితుడి ఫోన్‌కు వచ్చే మెసేజీలు, ఓటీపీలు వంటివన్నీ సైబర్ నేరగాళ్లకు తెలిసిపోతాయి. చివరకు బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వివరాలు వారి చేతుల్లో పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. బాధితులు అప్రమత్తమయ్యేటప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఓటీపీలు, బ్యాంకు కార్డుల సీవీవీలు, పిన్ నెంబర్ల వంటి వాటిని ఎవరికీ చెప్పకూడదు. ఇలాంటి వాటిని ఫోన్‌లో ఎవరైనా అడిగితే వెంటనే కాల్ కట్ చేసి సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించాలి.
సిమ్ డీయాక్టివేషన్, సర్వీస్ ఈజ్ లాస్ట్ అనే మేనేజీలు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే మొబైల్ ఆపరేటర్‌కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. పోర్టింగ్ లాక్, సిమ్ పిన్ వంటి సెక్యూరిటీ ఫీచర్లతో సిమ్ స్వాప్ ముప్పును తగ్గించుకోవచ్చు.
ఇలాంటి మోసాల్లో నిందితులు సాధారణంగా మొదటి చిన్న లావాదేవీలతో సైబర్ క్రైమ్‌కు దిగుతారు. కాబట్టి, మీ కొనుగోళ్లల్లో ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే సంబంధిత బ్యాంక్‌ను అలర్ట్ చేయాలి.
వర్చువల్ కార్డు, లేదా సెకెండరీ కార్డు ఫీచర్స్‌తో ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయాలి. చెల్లింపులపై కార్డులో కచ్చితమైన పరిమితులు సెట్ చేసుకోవాలి. దీంతో, దుర్వినియోగమైనప్పుడు వెంటనే అలర్ట్స్ అందుతాయి.
బ్యాంక్ కార్డుల సమాచారాన్ని మొబైల్‌లో ఎప్పుడూ టెక్స్ట్ ఫైల్ రూపంలో స్టోర్ చేయొద్దు. మొబైల్‌లో కచ్చితంగా యాంటీవైరస్ ప్రోగ్రామ్ ఇన్‌స్టాల్ చేసి ఉంచాలి. ముఖ్యమైన యాప్స్‌కు టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. ప్రభుత్వం, బ్యాంకుల పేరిట వచ్చే నకిలీ కాల్స్ బుట్టలో పడొద్దు. అనుమానం రాగానే బ్యాంకులు, పోలీసులను సంప్రదిస్తే ఆర్థికనష్టాన్ని చాలా వరకూ పరిమితం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
కాల్ ఫార్వార్డింగ్ స్కామ్.. ఈ ఉచ్చులో పడితే మీ జేబులు ఖాళీ
ప్రియుడి మోజులో వివాహిత దారుణం.. మంచానపడ్డ భర్తను కిరాతకంగా హత్య