Weak Heart Symptoms: గుండె బలహీన పడిందనేందుకు ప్రధాన సంకేతాలు
ABN , Publish Date - Jul 31 , 2025 | 07:25 AM
గుండె బలహీనపడిందనేందుకు కొన్ని ప్రధాన సంకేతాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆ మార్పులు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. మరి ఈ మార్పులు ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: హృద్రోగ లక్షణాలంటే మనకు సాధారణంగా ఛాతిలో నొప్పే గుర్తుకు వస్తుంది. అయితే, ఆహారం అరగకపోవడం, దగ్గు, గాయాలు వంటివి కూడా ఛాతి నొప్పికి కారణంగా కావచ్చు. ఇక గుండె బలహీన పడిందనేందుకు ఇతర అనేక లక్షణాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే అనుమానించాల్సిందే. గుండెకు రక్తప్రసరణ తగ్గినప్పుడు ఊపిరితిత్తుల్లో నీరు పేరుకుంటుంది. ఇలాంటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.
తగినంత రెస్టు తీసుకున్నా కూడా నీరసం వదలట్లేదంటే గుండె బలహీనపడిందని అర్థం. గుండె ద్వారా కండరాలు, ఇతర శరీర భాగాలకు ఆక్సిజనేటెడ్ రక్తం తగినంతగా సరఫరా కాకపోతే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. మెట్లు ఎక్కాలన్నా, బరువైన వస్తువులు మోసుకెళ్లాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంత రెస్టు తీసుకున్నా నిత్యం నీరసం వేధిస్తోందంటే వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో రక్తప్రసరణ సజావుగా సాగాలంటే గుండె ఆరోగ్యంగా ఉండాలి. గుండె బలహీనపడ్డ సందర్భాల్లో రక్తాన్ని ఇతర భాగాలకు పూర్తిస్థాయిలో పంప్ చేయలేదు. దీంతో, శరీర భాగాల్లో పలు చోట్ల నీరు (ఫ్లూయిడ్స్) పేరుకుంటుంది. దీన్ని వైద్య పరిభాషలో ఎడిమా అని అంటారు. కాళ్లు, మడమల్లో వాపునకు ఎడిమానే కారణం. ఒకే చోట కదలకుండా కూర్చొంటే ఈ వాపు మరింత ఎక్కువ అవుతుంది. ఎడిమా ఉన్నప్పుడు ఒక్కోసారి దిగువ శరీర భాగం మొత్తం బరువుగా అనిపిస్తుంది.
గుండె చలనంలో మార్పులపై నిత్యం దృష్టి పెట్టి ఉంచాలి. గుండె ఆరోగ్యానికి ఇది ప్రధాన సంకేతం. గుండె చలనంలో అసాధారణ మార్పులు (ఎరిథ్మియా), దడ ఎక్కువగా వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
గుండె బలహీనపడ్డప్పుడు మెదడుకు కూడా రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితంగా తలతిరగటం, స్పృహతప్పడం, నిత్యం మత్తుగా ఉండటం వంటి సమస్యలు మొదలవుతాయి. కాస్త శ్రమ పడ్డా కూడా శరీరం వణుకుతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే గుండె బలహీనపడుతున్నట్టుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
న్యూరోసర్జన్ల హెచ్చరిక.. ఈ ఫుడ్స్ తింటే మీ బ్రెయిన్ ఖతం
తెల్లవారుజామున 3 - 5 గంటల మధ్య మెళకువ వచ్చేవారు తెలుసుకోవాల్సిన విషయాలు