YS Sharmila : క్యారెక్టర్ ఖాళీ.. విలువలు సున్నా!
ABN , Publish Date - Feb 08 , 2025 | 02:19 AM
వైఎస్ జగన్‌కే విలువలు, విశ్వసనీయత లేవని ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు.

జగన్‌పై సోదరి షర్మిల మండిపాటు
ఆస్తుల కోసం తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచారు
సాయిరెడ్డితో బలవంతంగా అబద్ధాలు చెప్పించారు
ఏం మాట్లాడాలో 40 నిమిషాలు జగన్ డిక్టేట్ చేశారట
జగన్ నైజాన్ని సాయిరెడ్డి అర్థం చేసుకున్నారు
ఆయన వద్ద పడ్డ బాధలు నాతో చెప్పుకొన్నారు: షర్మిల
అబద్ధాలు చెప్పడం... నిజాలు అని నమ్మించడం జగన్ నైజం
అమరావతి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ‘నాయకుడికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ’ ఉండాలి అని సుద్దులు చెప్పిన వైఎస్ జగన్‌కే విలువలు, విశ్వసనీయత లేవని ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. సొంత తల్లి, చెల్లి, మేనకోడలు, మేనల్లుడికి వెన్నుపోటు పొడిచారని... నీచుడని మండిపడ్డారు. ఆస్తుల కోసం సొంత తల్లిపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డికి ఇష్టంలేకపోయినా, ఆయనపై ఒత్తిడి తెచ్చి... తనను తిట్టించారన్నారు. ‘‘జగన్ క్యారెక్టర్ ఖాళీ సీసాలాంటిది. ఆయన క్యారెక్టర్ సున్నా’’ అని తేల్చేశారు. శుక్రవారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న షర్మిల మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్‌కు విశ్వసనీయత, విలువలు ఏమాత్రం లేవు. నీతులు చెబుతారు కానీ పాటించరు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని జగన్ అధికారంలోకి వచ్చారు. వైఎస్ ఆశయాలనే కాలరాశారు’’ అని విమర్శించారు. చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించింది అవినాశ్ రెడ్డే అని సీబీఐ చెప్పిన తర్వాత కూడా... ఆయనను తన పక్కన కూర్చోబెట్టుకున్నారని ఆక్రోశించారు.
సాయిరెడ్డితో భేటీలో...
వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్‌లో షర్మిలతో భేటీ అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె ఇప్పుడు ధ్రువీకరించారు. సాయిరెడ్డితో జరిగిన సమావేశంలో చాలా విషయాలు చర్చకు వచ్చాయని షర్మిల చెప్పారు. ‘‘జగన్ సొంత తల్లి మీద కేసు పెట్టించారు. నిజాలు వెల్లడిస్తూ ఆయన కుట్రను నేను బయటపెట్టాను. అయితే... అవన్నీ అబద్ధాలని చెప్పాలంటూ సాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారు. ఆయనే స్వయంగా సాయిరెడ్డికి ఫోన్ చేసి... ప్రెస్‌మీట్ పెట్టాలన్నారు. అందుకు ఆయన నిరాకరించినా... జగన్ ఒప్పుకోలేదు. ఆస్తుల్లో ఇద్దరు బిడ్డలకూ సమానవాటా ఉందని మా తండ్రి జీవించి ఉన్నప్పుడే సాయిరెడ్డి చెప్పారు. తనను వదిలేయాలని సాయిరెడ్డి వేడుకోవడంతో వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత మళ్లీ సాయిరెడ్డి మీద జగన్ ఒత్తిడి చేశారు. తనకు ఇష్టంలేదని, కుదరదని సాయిరెడ్డి చెప్పినా జగన్ వినిపించుకోలేదు. సాయిరెడ్డి మాట్లాడాల్సిన అంశాలన్నీ స్వయంగా జగన్ నోట్ ఇచ్చారట! ఏం మాట్లాడాలో 40 నిమిషాలు డిక్టేట్ చేశారట’’ అని షర్మిల వివరించారు. జగన్ నైజం ఏమిటో విజయసాయిరెడ్డి అర్థం చేసుకున్నారని... ఈ విషయాలను ఆయన చెబుతుంటే తనకు చాలా బాధేసిందని, కన్నీళ్లు వచ్చాయని అన్నారు.
ఇంత దిగజారడమా...
వైఎస్ కుమారుడై ఉండి ఇంతలా దిగజారాలా అని జగన్‌పై షర్మిల మండిపడ్డారు. ‘‘క్యారెక్టర్‌లేని జగన్... క్యారెక్టర్ మీద డైలాగులు చెబుతున్నారు. ఆ పదానికి అర్థం కూడా ఆయనకు తెలియదు. తననువదిలేయాలని బతిమలాడిన సాయిరెడ్డిపై ఒత్తిడి చేయడమేనా క్యారెక్టర్?’’ అని నిలదీశారు. సొంత మేనల్లుడు, మేనకోడలి ఆస్తిని కాజేయాలని జగన్ చూశారని ఆరోపించారు. ‘మీరు చేసిన కుట్రలేమిటో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆస్తుల కోసం జగన్, ఆయన భార్య ఎంత దిగజారిపోయారో బైబిల్ ముందు కూర్చుని ఆలోచించాలి. అబద్దాలు ఆడకూడదంటూనే జగన్ అబద్ధాలు చెబుతారు. అవే నిజాలని నమ్మించే ప్రయత్నం చేస్తారు’’ అంటూ జగన్‌పై ధ్వజమెత్తారు.
ఇదేనా క్రెడిబులిటీ...
వైఎస్ బీజేపీకి వ్యతిరేకమని... ఇప్పుడు అదే బీజేపీతో జగన్ అక్రమ సంబంధం పెట్టుకున్నారని షర్మిల అన్నారు. వైఎస్ జలయజ్ఞం ప్రాజెక్టులు మొదలు పెట్టాగా... వాటిని ఆరు నెలల్లో పూర్తి చేస్తానని జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. క్రెడిబిలిటీ ఉంటే ప్రాజెక్టుల జగన్ ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ‘‘ నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో ఆడుకున్నప్పుడు క్రెడిబిలిటీ ఏమైంది? రుషికొండను తొలచి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టినప్పుడే ఆయన విశ్వసనీయత పోయింది. ఆయనకు క్రెడిబులిటీ లేదు. డబ్బు ఉందనే అహంకారం మాత్రం ఉంది’’ అని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం