YS Viveka: రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
ABN , Publish Date - Mar 07 , 2025 | 07:16 PM
YS Viveka: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్ష్యులు ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా మృతి చెందడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అక్కడే ఉన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైతం వాచ్‌మెన్ రంగయ్య మృతి అనుమానాస్పందమని స్పష్టం చేశారు. ఇక సీఎం చంద్రబాబు నాయడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

అమరావతి, మార్చి 07: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షుల్లో ఒకరైన వాచ్ మెన్ రంగయ్య అనుమానాస్పద మృతి నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తమైంది. వివేకా హత్య కేసులో సాక్షులు వరుసగా మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి హత్య కేసులో మిగిలిన సాక్షులకు తగిన రక్షణ కల్పించాలంటూ డీజీపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం అమరావతిలో కేబినెట్ సమావేశమైంది. ఈ కేబినెట్ భేటీ దాదాపు రెండు గంటల పాటు సాగింది. అయితే ఈ భేటీ అనంతరం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షుల్లో ఒకరైన రంగన్న మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది.
ఈ సమావేశంలో వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్న అంశంపై గంటపాటు చర్చ సాగింది. ఆ క్రమంలో రంగయ్య మృతి వెనుక ఉన్న సందేహాలను మంత్రులకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. వైఎస్ వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించినట్లే.. వైసీపీకి చెందిన మీడియాలో వాచ్‌మెన్ రంగయ్యను పోలీసులే చంపారంటూ తొలుత ప్రసారం కావడంపై కేబినెట్‌లోని పలువురు మంత్రులు సందేహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. వైఎస్ జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ తాను పదే పదే చెబుతూ వస్తున్నానని వాళ్లకు వివరించారు.
Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో సాక్షులు సైతం ఇలానే చనిపోతూ వచ్చారనే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్బంగా వారికి సోదాహరణగా వివరించారు. దీంతో వాచ్ మెన్ రంగయ్య మృతి సైతం ముమ్మాటికీ అనుమానాస్పదమేనని సీఎం చంద్రబాబు నాయుడు కరాఖండిగా చెప్పారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైతం వెంటనే జోక్యం చేసుకుని.. ఇది అనుమానాస్పద మృతేనని పోలీసుల విచారణలోనూ నిర్ధారణ అయిందని వెల్లడించారు.
Also Read: పరీక్ష పేపర్ లీక్.. సోషల్ మీడియాలో ప్రత్యక్షం..
ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురు సాక్షులు చనిపోయారన్నారు. ఈ ఆరుగురు సాక్షులు వరుసగా చనిపోవడం ఎక్కడ జరగలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన నాటి నుంచి చోటు చేసుకున్న ఘటనలన్ని డీజీపీ ఒకసారి వివరించారు. ఏ దురుద్దేశం లేకుంటే సాక్షి మీడియాలో రంగన్న మృతిని పోలీసులకు ఆపాదించాలని ఎందుకు చూస్తారంటూ గట్టి చర్చ జరిగింది.
Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ
రంగన్నను హత్య చేసి అది కూడా ప్రభుత్వానికి ఆపాదించాలనే కుట్ర ఇందులో దాగి వుందని మంత్రివర్గంలో వ్యక్తమైంది. అలాగే ఈ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న దస్తగిరికి వచ్చిన బెదిరింపులపై సైతం ఈ చర్చ జరిగింది. ఈ హత్య కేసులో ఉన్న అనుమానాలతో కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు. సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ కేసు సీబీఐ పరిధిలో ఉందని.. ఈ నేపథ్యంలో సాక్షులను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
2019, మార్చి 15వ తేదీ తెల్లవారుజామున మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి.. తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో.. ఈ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ హత్య జరిగన సమయంలో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దీంతో ఈ హత్యను నాటి చంద్రబాబు ప్రభుత్వమే చేయించిందని మీడియాలో ప్రకటించారు. అంతేకాదు.. ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా అయితేనే.. ఈ హత్య వెనుక ఉన్న పాత్రదారులు, సూత్రదారులు బయటకు వస్తారన్నారు. అందుకోసం వైఎస్ జగన్ న్యాయస్థానాన్ని సైతం ఆయన ఆశ్రయించారు. ఇంతలో ఎన్నికలు వచ్చాయి.
ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దాంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న తన పిటిషన్‌ను కోర్టు నుంచి వెనక్కి తీసుకున్నారు. అలాగే తన తండ్రి హత్య కేసులో దోషులను చట్టానికి పట్టించాలంటూ సోదరుడు సీఎం వైఎస్ జగన్‌ను వైఎస్ వివేకా కుమార్తె కోరింది. ఆ సమయంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన సమాధానంతో ఆమె ఒకింత షాక్‌కు గురైంది. ఆ క్రమంలో ఆమెతోపాటు తన తల్లి, వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐ చేతిలోకి వెళ్లింది. అయితే ఈ హత్య కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ నేపథ్యంలో సీఎంచంద్రబాబు పైవిధంగా స్పందించారు.
For AndhraPradesh News And Telugu News