Share News

Vizianagaram Terror Case: విజయనగరం ఉగ్ర లింకుల కేసు.. రంగంలోకి ఎన్‌ఐఏ

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:17 AM

Vizianagaram Terror Case: విజయనగరం ఉగ్ర లింకుల కేసుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Vizianagaram Terror Case: విజయనగరం ఉగ్ర లింకుల కేసు.. రంగంలోకి ఎన్‌ఐఏ
Vizianagaram Terror Case

విజయనగరం, జూన్ 28: విజయనగరం ఉగ్ర లింకుల కేసును (Vizianagaram Terror Case) జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ‌కు (NIA) బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారనే ఆరోపణలతో గత నెల 16న విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్‌లను విజయనగరం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇరువురు నిందితులు విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం ఎన్‌ఐఏకు అప్పగించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.


కాగా.. ఉగ్రలింకుల కేసులో అరెస్ట్ అయిన సిరాజ్, సమీర్‌లను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గతంలో పోలీసులు కోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఇద్దరినీ వారం రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఎన్‌ఐఏ, యాంటీ బాంబ్ స్క్వాడ్, మిగిలిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. విజయనగరం చేరుకుని వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించారు. ఎక్కడెక్కడ బాంబులు పెట్టి పేల్చాలని చూశారు, సంఘ విద్రోహులుగా ఏ విధంగా మారాలని అనుకున్నారు, విదేశాల నుంచి ఏ రకంగా నిధులు అందాయనే దానిపై సమగ్రమైన సమాచారాన్ని ప్రాథమికంగా తెలుసుకున్నారు.


వారం రోజుల గడువు ముగిసిన వెంటనే సిరాజ్, సమీర్‌లను కోర్టులో హాజరుపర్చగా.. మరోసారి రిమాండ్ విధించడంతో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి నుంచి సేకరించిన ఆధారాలను క్రోడీకరించి ఇంకా లోతైన దర్యాప్తు అవసరమని భావించిన నేపథ్యంలో ఎన్ఐఏకు అప్పగించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఇద్దరినీ ఎన్‌ఐఏకు అప్పగించేందుకు విజయనగరం పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఏ క్షణమైనా సిరాజ్, సమీర్లను జాతీయ దర్యాప్తు సంస్థ తమ ఆధీనంలోకి తీసుకుని ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్

Puri Rath Yatra: జగన్నాథుని రథయాత్రలో అపశృతి.. 500 మందికి పైగా గాయాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 28 , 2025 | 04:57 PM