Share News

Look App Scam: లుక్‌ తో లూటీ

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:36 AM

లుక్‌ అంటూ ఓ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. తాము పంపే లింక్‌ను ఓపెన్‌ చేసి కొన్ని సెకన్లపాటు చూస్తే ఒక్కో లింక్‌కు రూ.15 ఇస్తామంటూ ఆశ రేపింది.

Look App Scam: లుక్‌ తో లూటీ

  • లుక్‌ యాప్‌తో ఆదాయం అంటూ ఎర

  • చైన్‌ లింక్‌ పద్ధతిలో కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు

  • ఉమ్మడి అనంతపురంలో వేలాదిగా బాధితులు

అనంతపురం క్రైం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ‘లుక్‌’ అంటూ.. ఓ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. తాము పంపే లింక్‌ను ఓపెన్‌ చేసి కొన్ని సెకన్లపాటు చూస్తే.. ఒక్కో లింక్‌కు రూ.15 ఇస్తామంటూ ఆశ రేపింది. ఇలా వేలల్లో సంపాదించుకోవచ్చు.. ఆ సొమ్ముని వారం వారం విత్‌డ్రా చేసుకోవచ్చు అంటూ నమ్మించింది. సెక్యూరిటీ డిపాజిట్‌ కడితే ప్రతి లెవెల్‌కూ మీ ఆదాయం భారీగా పెరుగుతుందని ఎర వేసింది. అంతే.. దేశవ్యాప్తంగా 30 లక్షల మంది అందులో చేరిపోయారు. భారీగా సొమ్ములు జమ చేశారు. అందరికీ నమ్మకం కుదిరాక.. యాప్‌ నిర్వాహకులు అందరి చెవుల్లోనూ పూలు పెట్టారు. ఇప్పటికే వసూలు చేసిన కోట్లాది రూపాయలతో మాయమయ్యారు. నిర్వాహకులు ఎవరో తెలీక బాధితులు లబోదిబోమంటున్నారు.


లుక్‌ యాప్‌ మార్కెట్‌లోకి వచ్చిన కొత్తలో మొదటి నాలుగు రోజులు ఫ్రీగా ఎంట్రీ కల్పించారు. రోజుకు రూ.200 ఆదాయం చూపించారు. ఆ తర్వాత యాప్‌లో కొనసాగాలంటే సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని షరతు పెట్టారు. లెవెల్‌ పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఆ సొమ్మును యాప్‌ వ్యాలెట్‌ నుంచి తమ బ్యాంకు ఖాతాలకు మళ్లించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నెల 25లోగా చేరేవారికి సెక్యూరిటీ డిపాజిట్‌ తిరిగి ఇచ్చేస్తామని, చేర్పించే వారికి టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, కార్లు.. చివరకు రూ.50 లక్షల విలువ చేసే ఇళ్లను కానుకగా ఇస్తామన్నారు. దీంతో చాలామంది ఎగబడ్డారు.


డిపాజిట్లు రూ.కోట్లలో వెల్లువెత్తాయి. పని పూర్తి కాగానే, మూడు రోజుల క్రితం (బుధవారం సాయంత్రం నుంచి) యాప్‌ పనిచేయడం మానేసింది. చైన్‌లింక్‌ పద్దతిలో లుక్‌ యాప్‌ అందరికీ టోకరా వేసింది. ఈ భారీ సైబర్‌ నేరంలో లుక్‌ యాప్‌ నిర్వాహకులెవరో ఏ ఒక్కరికీ తెలియదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దీని బాధితులు వేలల్లో ఉన్నారు. కానీ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు అనధికారికంగా ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. లుక్‌ యాప్‌ చిరునామా పుణెలో, అమెరికాలో ఉన్నట్టు చూపుతోంది. ‘డబ్లూడబ్లూడబ్లూ.77లుక్‌.కామ్‌’ పేరిట వెబ్‌సైట్‌ నిర్వహిస్తోంది.

Updated Date - Jun 28 , 2025 | 05:36 AM