High Court: సీబీఐ నివేదిక కోసం విజయవాడ కోర్టుకు వెళ్లండి
ABN , Publish Date - Jun 28 , 2025 | 05:46 AM
హత్య కేసులో సీబీఐ దాఖలు చేసి ఫైనల్ రిపోర్ట్ కోసం సంబంధిత కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని ఆయేషా మీరా తల్లిదండ్రులకు హైకోర్టు మరోసారి సూచించింది.

ఆయేషా తల్లిదండ్రులకు హైకోర్టు సూచన
అమరావతి, విజయవాడ, జూన్ 27(ఆంధ్రజ్యోతి): హత్య కేసులో సీబీఐ దాఖలు చేసి ఫైనల్ రిపోర్ట్ కోసం సంబంధిత కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని ఆయేషా మీరా తల్లిదండ్రులకు హైకోర్టు మరోసారి సూచించింది. తుది నివేదికను తమకు అందజేసేలా ఆదేశించాలంటూ ఆయేషా తల్లిదండ్రులు వేసిన అనుబంధ పిటిషన్‌పై సీబీఐ వేసిన కౌంటర్... ఫైలులో చేరకపోవడంతో విచారణను జూలై 4కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్ల తరఫు పిచ్చుక శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ తుది నివేదికను పొందేందుకు మృతురాలి తల్లిదండ్రులు అర్హులన్నారు. నివేదికను అందజేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. సీబీఐ తరఫున పీఎస్‌పీ సురేశ్‌కుమార్ వాదనలు వినిపించారు.
ఈ కేసులో సీబీఐ దర్యాప్తు విఫలం: ఆయేషా తల్లిదండ్రులు
తమ కుమార్తె ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు విఫలమైందన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి నివేదికా మాకివ్వలేదు.. తెలియజేయలేదు. అందుకే ఈ అనుమానం కలుగుతోంది’ అని ఆమె తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషా అన్నారు. విజయవాడలోని న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ కార్యాలయంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పుడు మాకు న్యాయం జరగాలంటే సీఎం చంద్రబాబు కేసును ప్రత్యేకంగా తీసుకోవాలి’ అని కోరారు.