Share News

Farmers: కౌలు రైతుల నిరాశ

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:55 AM

కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదు. ప్రతి ఏటా గుర్తింపు కార్డులను కొద్దిమంది కౌలు రైతులకు మాత్రమే జారీ చేస్తుండడంతో ప్రభుత్వ ఇచ్చే వివిధ రాయితీలు, ప్రోత్సాహకాలకు దూరమవుతున్నారు.

Farmers: కౌలు రైతుల నిరాశ
Farmers

  • రెండో విడత కూడా అందని ‘అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌’ పథకాలు

  • జిల్లాలో 80 వేల మందికిపైగా కౌలు రైతులు

  • 6 వేల మందికి సీసీఆర్‌ కార్డులు ఇవ్వాలని అధికారులు నిర్ణయం

  • ఇంతవరకు 4,987 మందికి మాత్రమే జారీ

  • వీరిలో ఒక్కరికి కూడా అందని ప్రభుత్వ రాయితీలు, ఆర్థిక సాయం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి): కౌలు రైతుల (Farmers)కు ప్రభుత్వ సాయం అందడం లేదు. ప్రతి ఏటా గుర్తింపు కార్డులను కొద్దిమంది కౌలు రైతులకు మాత్రమే జారీ చేస్తుండడంతో ప్రభుత్వ ఇచ్చే వివిధ రాయితీలు, ప్రోత్సాహకాలకు దూరమవుతున్నారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి సాయంగా ‘అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌’ పథకాల కింద అందించిన సొమ్ము కౌలు రైతులకు అందలేదు. వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 80 వేల మంది కౌలు రైతులు వున్నారు. సొంత భూములు వున్న రైతులకంటే వ్యవసాయ ఖర్చులు వీరికే అధికంగా వుంటాయి. పంటల సాగుకు పెట్టుబడితోపాటు భూ యజమానికి కౌలు రూపంలో పండిన పంటలో కొంతభాగం లేదా నగదు చెల్లించాలి.


ఇంటిల్లిపాదీ పొలంలో పనులు చేస్తున్నప్పటికీ చాలా మంది కౌలు రైతులకు కుటుంబ సభ్యులు శ్రమపాటు ఆదాయం కూడా మిగలడంలేదు. ఇటువంటి తరుణంలో కౌలు రైతులకు కూడా ప్రభుత్వ పరంగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2019లో ‘ఆంధ్రప్రదేశ్‌ క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌’ అనే చట్టాన్ని తెచ్చింది. కౌలు రైతులందరికీ పంట సాగు హక్కు (సీసీఆర్‌) కార్డులు జారీ చేయాలి. ఇది వున్న కౌలు రైతులకు మాత్రమే ప్రభుత్వం నుంచి రాయితీలు, సంక్షేమ పథకాలు అందుతాయి. కానీ జిల్లాలో వాస్తవంగా వున్న కౌలు రైతులకు, అధికారులు జారీ చేస్తున్న సీసీఆర్‌ కార్డులకు ఎక్కడా పొంతన వుండడంలేదు.


వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 80 వేల మంది కౌలు రైతులు వున్నారు. కానీ ఏడాది ఆరు వేల మంది రైతులకు సీసీఆర్‌ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతవరకు 4,987 మందికి మాత్రమే కార్డులు జారీ అయ్యాయి. వీటిని పొందిన వారికి పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ పథకాల సాయం అందలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాల కింద రెండు విడతల్లో ఒక్కో రైతులకు రూ.14 వేలు అందాయి. కానీ కౌలు రైతులకు ఒక్కసారి కూడా పెట్టుబడి సాయం అందలేదు. వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. జిల్లాలో వున్న కౌలు రైతులందరికీ సీసీఆర్‌ కార్డులు ఇవ్వాలని, అన్ని రకాల రాయితీలు, పథకాలు వర్తింపజేయాలని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు అప్పలరాజు డిమాండ్‌ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూముల రీ సర్వే చేయండి: రఘురామ

విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదల

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 22 , 2025 | 07:40 AM