Alluri District Restrictions: అల్లూరి జిల్లాలో పోలీసుల ఆంక్షలు..
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:37 PM
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. మన్యంలోకి రావద్దని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు.
అల్లూరి జిల్లా, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. మన్యంలోకి రావద్దని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. రేపు(ఆదివారం) దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. అయితే, వరుస ఎన్‌కౌంటర్లతో హడలిపోతున్నారు గిరిజనులు. ఏవోబీ సరిహద్దు ప్రాంతంతో పాటు మారేడుమిల్లి అడవుల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మైదాన ప్రాంతాల్లోనూ మావోయిస్టుల కోసం నిఘా పెట్టారు ఏపీ పోలీసులు.
మృతదేహాలకు పోస్టుమార్టమ్ పూర్తి...
మరోవైపు, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన రెండు వరుస ఎన్‌కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలకు పోస్టుమార్టమ్ పూర్తి చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మావోయిస్టు కీలకనేత సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన సతీమణి రాజేతో పాటు మరో కీలకనేత ఏవోబీ ఇన్‌చార్జ్ టెక్ శంకర్, మల్ల, జ్యోతి, లోకేశ్, కరమ్ షమ్మీ, లక్మల్, కమ్లు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సురేశ్ అలియాస్ రమేశ్, సైను అలియాస్ వాసు, అనిత, మృతదేహాలకు ఇవాళ(శనివారం) పోస్టుమార్టమ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగిస్తున్నారు. కుటుంబ సభ్యుల డీఎన్ఏ ఆధారంగా మావోయిస్టుల మృతదేహాలను అప్పగిస్తున్నారు. టెక్ శంకర్ మినహా మృతిచెందిన మావోయిస్టులంతా చత్తీస్‌ఘడ్ సుక్మా జిల్లాకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో రంపచోడవరం ఏరియా ఆస్పత్రి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు ఏపీ పోలీసులు.
ఇవి కూడా చదవండి...
మావోయిస్టులకు బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు
ఐబొమ్మ రవి కేసు.. వెలుగులోకి కీలక అంశాలు
Read Latest AP News And Telugu News