Anitha: జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు.. హోం మంత్రి అనిత ఫైర్
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:03 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలు వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ హయాంలో ఏపీ ఎంతో నష్టపోయిందని విమర్శించారు.

అనకాపల్లి జిల్లా: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలు వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ హయాంలో ఏపీ ఎంతో నష్టపోయిందని విమర్శించారు. ఇవాళ(ఆదివారం) యస్ రాయవరం మండలం రామయ్యపట్నం గ్రామంలో హోం మంత్రి అనిత పర్యటించారు. రామయ్యపట్నంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. రామయ్యపట్నం గ్రామంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఇప్పుడు ఎన్నికలు లేవని.. ప్రజల యోగక్షేమాలని తెలుసుకోవడానికే తాను రామయ్యపట్నం వచ్చానని చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలు ఉన్నా, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రారంభమవుతుందని..త్వరలోనే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని నొక్కిచెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హత ఉన్నవారందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు హోం మంత్రి అనిత.
రామయ్యపట్నం గ్రామంలో తీర్మానాలు ఇవ్వకపోవడంతోనే ఈ గ్రామం అభివృద్ధిలో వెనుకంజలో ఉందని అన్నారు. రామయ్యపట్నం గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాటిచ్చారు. పార్టీలకు అతీతంగా రామయ్యపట్నం అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో టాయ్ పరిశ్రమ వస్తే, 25 వేల మంది మహిళలకు ఉద్యోగాలు రానున్నాయని వెల్లడించారు.జిల్లాకు స్టీల్ ఫ్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ..పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కోట మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు.. పలువురు ప్రముఖుల సంతాపం
ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు మంత్రి పరామర్శ
For More AP News and Telugu News