Share News

Political Clash: తాడిపత్రిలో హైటెన్షన్‌

ABN , Publish Date - Jun 30 , 2025 | 05:00 AM

అనంతపురం జిల్లా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దారెడ్డి ఇంటిపై దాడికి జేసీ ప్రభాకర్‌ రెడ్డి బయల్దేరడంతో ఆందోళన నెలకొంది.

Political Clash: తాడిపత్రిలో హైటెన్షన్‌

  • మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాకతో అలజడి

  • ఇంటిపై దాడికి జేసీ ప్రభాకర్‌రెడ్డి యత్నం

తాడిపత్రి, జూన్‌29(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దారెడ్డి ఇంటిపై దాడికి జేసీ ప్రభాకర్‌ రెడ్డి బయల్దేరడంతో ఆందోళన నెలకొంది. పోలీసులు పెద్దారెడ్డికి నచ్చజెప్పి అనంతపురం తరలించడంతో సమస్య సద్దుమణిగింది. గతేడాది శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇరువర్గాలవారు దాడులు చేసుకున్నారు. దీంతో పెద్దారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అశ్మిత్‌రెడ్డిపై మూడు నెలలు పోలీసులు నియోజకవర్గ బహిష్కరణ విధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలలకు అశ్మిత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రికి వచ్చారు. పెద్దారెడ్డిని పోలీసులు అనుమతించలేదు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందంటూ అడ్డు చెప్పారు. దీంతో పెద్దారెడ్డి కోర్టును ఆశ్రయించగా... తాడిపత్రికి వెళ్లవచ్చునని అనుమతి ఇచ్చింది. ఆయన తాడిపత్రికి రావడం, పోలీసులు వెనక్కి పంపడం జరుగుతోంది. వారం క్రితం పోలీసులపై ఆయన కోర్టులో పిటిషన్‌ వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరికీ తెలియకుండా ఆదివారం ఉదయం స్వగ్రామమైన యల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వచ్చారు. పెద్దారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. విషయం తెలుసుకుని ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్దకు పెద్దఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. జేసీ కార్యకర్తలతో కలిసి పెద్దారెడ్డి ఇంటి వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి వెళ్లిపోవాలని, లేదంటే ఇంటిపైకి వెళ్తామని కార్యకర్తలు పట్టుబట్టారు. పెద్దారెడ్డితో ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ వెళ్లి చర్చించారు. సొంతూరు వెళ్లాలని సూచించారు. తనకు కోర్టు ఆర్డర్‌ ఉందని, వెళ్లనని ఆయన చెప్పారు. ఆయనను పోలీసులు జీపులో ఎక్కించి, అనంతపురం తరలించారు.


పెద్దారెడ్డి కోసం వచ్చిన వారికి రప్పా రప్పా..

ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘పెద్దారెడ్డి ఒక్కరే నాకు శత్రువు. అతడికి సపోర్ట్‌గా వచ్చిన కార్యకర్తలు, నాయకులందరినీ రప్పా.. రప్పా ఆడిస్తా’ అని హెచ్చరించారు. తాను నాలుగు రోజులపాటు తాడిపత్రిలో ఉండనని, తమ కార్యకర్తలు రప్పా.. రప్పా ఆడిస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు మంచోడు కాబట్టే వైసీపీ ఆటలు సాగుతున్నాయన్నారు. తాడిపత్రిలో అలాంటిదేమీ ఉండదని, రేపటి నుంచి వేరే అంటూ వ్యాఖ్యానించారు. దొంగగా తాడిపత్రికి వచ్చి వెళ్తున్న పెద్దారెడ్డిని వైసీపీ కార్యకర్తలు, నాయకులు నమ్ముకోవద్దన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 05:02 AM