Share News

Anitha ON Kasibugga Incident: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ: హోంమంత్రి అనిత

ABN , Publish Date - Nov 01 , 2025 | 03:25 PM

కాశీబుగ్గ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్పీ సహా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమగ్ర విచారణకు హోంమంత్రి ఆదేశించారు.

Anitha ON Kasibugga Incident: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ: హోంమంత్రి అనిత
Anitha ON Kasibugga Incident

శ్రీకాకుళం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం (Kasibugga Venkateswara Swamy Temple)లో తొక్కిసలాట జరిగి 10మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల్లో 9 మంది మహిళలు కాగా.. 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగ్రాతులని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, కాశీబుగ్గ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆమె మాట్లాడారు. ఈ ఘటనపై ఎస్పీ సహా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. హోంమంత్రి అనిత.


శ్రీకాకుళంలో జరిగిన ఘటన చాలా దురదృష్టమని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం నాలుగు నెలల క్రితమే ఆలయం తెరిచారని తెలిపారు. శనివారం ఏకాదశి కావడం వల్ల మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో గుడికి వచ్చారని వెల్లడించారు. వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు వెళ్లిన సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందని వివరించారు. మొదటి అంతస్తులో స్వామివారి ఆలయం ఉంటుందని.. మెట్లు ఎక్కే సమయంలో రైలింగ్ విరిగిపడి ఈ దుర్ఘటన జరిగిందని వెల్లడించారు. రైలింగ్‌తో పాటు భక్తులు పడిపోవడంతోనే ఇంతమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు హోంమంత్రి అనిత.


భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఒకేసారి 15 వందల మంది వచ్చేసరికి తోపులాట జరిగిందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఇది చాలా విషాదకర ఘటన అని తెలిపారు. భక్తులు ఎవరూ ఆందోళనకి గురికావొద్దని ధైర్యం చెప్పారు. ఫైర్, పోలీస్ శాఖల అధికారులు తక్షణం సహాయ కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ ఘటనలో చనిపోయిన కుటుంబసభ్యులందరికీ తన ప్రగాఢమైన సానుభూతి తెలిపారు. సింహాచలం, తిరుపతి ఘటనల తర్వాత ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. పర్వదినాల సమయంలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు సైతం ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 01 , 2025 | 03:55 PM