Forest Land Encroachment : అటవీ శాఖ వెనుకడుగు?
ABN , Publish Date - Feb 25 , 2025 | 06:01 AM
మాజీ సీఎం జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ఆక్రమించుకున్నారని పదే పదే రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నప్పటికీ..

‘సజ్జల’ భూఆక్రమణలపై వింత వైఖరి
ఆ భూములు తమవి కాదంటున్న అటవీశాఖ
కడప, ఫిబ్రవరి 24 (ఆంరఽధజ్యోతి): కడప జిల్లాలో అటవీభూములను మాజీ సీఎం జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ఆక్రమించుకున్నారని పదే పదే రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నప్పటికీ.. అవి మావి కాదంటూ అటవీ అధికారులు చెబుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కడప నగర శివారులోని సీకేదిన్నె రెవెన్యూ పొలం సర్వే నంబర్లలో 1,590 నుంచి 1,629 పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబానికి చెందిన తొమ్మిది మంది పేర్లతో 146.75 ఎకరాల పట్టాభూమి ఉంది. బినామీ పేర్లతో కలిపి మొత్తం 202 ఎకరాలు వారి ఆధీనంలో ఉన్నాయి. కాగా, సర్వే నెంబరు 1,629లో అటవీశాఖకు 11,129.33 ఎకరాల భూములున్నాయి. ఇవి సజ్జల కుటుంబం భూముల మధ్యలో కూడా ఉన్నాయి. వీటిలో సుమారు 55 ఎకరాల్లో సజ్జల కుటుంబీకులు ఆక్రమించి మామిడి, ఇతర చెట్లు నాటారన్నది ఆరోపణ. ఇదే విషయం రెవెన్యూ అధికారుల సర్వేలో కూడా తేలింది. ఈ వ్యవహారం ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టడంతో కలకలం రేగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ, సర్వే అధికారులు ఇప్పటికే పలుమార్లు సర్వే నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అవి అటవీశాఖ భూములుగా తేలాయి. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ విచారణలోనూ ఇవి అటవీశాఖ భూములని తేలింది. అయితే అటవీశాఖ మాత్రం ఈ భూములు తమవి కాదంటూ తప్పించుకుంటూ కాలయాపన చేస్తోంది.
కడప భూముల వ్యవహారంపై సజ్జల కుటుంబీకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. త్రిసభ్య కమిటీతో విచారణ చేయించేందుకు న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ, సర్వే, అటవీ అధికారులు విచారణ చేస్తున్నారు. సోమవారం మరోసారి ఆర్డీవో జాన్ ఎర్విన్, సీకేదిన్నె తహశీల్దారు నాగేశ్వరరావు, డీఎ్‌ఫవో వివేకానంద భూముల వద్దకు వెళ్లారు. భూముల మ్యాప్‌ను పరిశీలించారు.