Share News

CS Vijay Anand Review: ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష

ABN , Publish Date - Apr 29 , 2025 | 03:16 AM

మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎస్ విజయానంద్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల రాకపోకలు, భద్రత, తాగునీరు, ఆహార ఏర్పాట్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

CS Vijay Anand Review: ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష

  • విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): మే 2న అమరావతి పనుల పునఃప్రారంభానికి రానున్న ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ సోమవారం అధికారులతో సమీక్షించారు. విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలందరూ మధ్యాహ్నం 1.30 గంటలకు సభావేదిక వద్దకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి బస్సుకు ఒక వ్యక్తిని ఇన్‌చార్జిగా ఉంచి.. ప్రజలను సురక్షితంగా తీసుకువచ్చి, తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా జాగ్రతలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారందరికీ ఆహారం, తాగునీరు వంటి సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడా ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ముందుగానే తగిన ప్రణాళిక చేసుకోవాలని పోలీసుఉన్నతాధికారులు, కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏర్పాట్ల పర్యవేక్షణ రాష్ట్ర నోడల్‌ అధికారి వీరపాండ్యన్‌ ప్రఽధాని మోదీ పర్యటన కార్యక్రమాన్ని వివరించారు.


ప్రధాని 2వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, తర్వాత హెలికాప్టర్‌లో రాష్ట్ర సచివాలయ ప్రాంగణానికి, అక్కడ నుంచి సభా వేదిక వద్దకు వస్తారని పేర్కొన్నారు. సభ ముగిసిన అనంతరం తిరిగి హెలికాప్టర్‌లో విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ బయలుదేరివెళతారని చెప్పారు.

విజయవాడ నేతలతో మంత్రి అచ్చెన్న టెలీకాన్ఫరెన్స్‌

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రి అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్‌, సుజనాచౌదరి తదితరులతో మాట్లాడారు.

Updated Date - Apr 29 , 2025 | 03:18 AM