Penchalayya case: పెంచలయ్య హత్య కేసు.. అరవ కామాక్షి అరెస్ట్
ABN , Publish Date - Nov 30 , 2025 | 04:50 PM
సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.
నెల్లూరు, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో (Penchalayya case) సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని అరెస్టు చేశామని.. గంజాయి కేసు కూడా ఆమెపై ఉందని తెలిపారు. హత్య జరిగిన తర్వాత కామాక్షి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. కామాక్షి ఇంట్లో 25 కేజీల గంజాయితోపాటు కొన్ని కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కామాక్షికి నేరచరిత్ర ఉందని తమ దర్యాప్తులో తేలిందని చెప్పుకొచ్చారు డీఎస్పీ శ్రీనివాసరావు.
కల్లూరుపల్లిలో ఈ నెల 28వ తేదీన పెంచలయ్యని హత్య చేశారని తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారిస్తున్నామని చెప్పుకొచ్చారు. పెంచలయ్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. పెంచలయ్య ఆర్డీటీ కాలనీ నివాసి అని వివరించారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఆర్డీటీ కాలనీలో ఉండకూడదనే నిబంధన ఉందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెంచలయ్య పోరాడేవారని గుర్తుచేశారు. ఆర్డీటీ కాలనీలో అరవ కామాక్షమ్మ, ఆమె అనుచరులు నేర కార్యకలాపాలు కొనసాగిస్తుండేవారని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే పెంచలయ్య వీరి అరాచకాలను ఎదిరించారు. దీంతో పెంచలయ్యపై అరవ కామాక్షమ్మ, ఆమె అనుచరులు కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఈ కేసులో పోలీసు బృందాలు ఎంతో కష్టపడి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. నిందితుల దగ్గరి నుంచి ఏడు కత్తులు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. పెంచలయ్య కేసులో మొత్తం 14 మంది నిందితులు ఉన్నారని తెలిపారు.
కామాక్షమ్మను గంజాయి కేసులో అరెస్ట్ చేశామని, మరో నిందితుడు జేమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని వెల్లడించారు. ప్రజలందరూ పోలీసులకు సహాకరించి నేరస్థుల వివరాలు అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చే వారికి రివార్డులూ అందిస్తామని నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల
Read Latest AP News and National News