Share News

AP DSC Notification: మెగా డీఎస్సీ బీ రెడీ

ABN , Publish Date - Apr 21 , 2025 | 02:58 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు విడతలుగా నోటిఫికేషన్లు విడుదల చేయబడిన ఈ డీఎస్సీలో దరఖాస్తు గడువు మే 15 వరకు ఉంటుంది

AP DSC Notification: మెగా డీఎస్సీ బీ రెడీ

  • 16,347 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

  • 7,487 స్కూల్‌ అసిస్టెంట్‌

  • 6,599 ఎస్జీటీ పోస్టులు

  • అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2,645 ఖాళీలు

  • 3 ప్రధాన మార్పులతో 2 వేర్వేరు నోటిఫికేషన్లు

  • మే 15 వరకు దరఖాస్తులకు గడువు

  • జూన్‌ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు

  • పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహణ

  • ప్రాధాన్యం ముందే ఎంపిక చేసుకోవాలి

  • అభ్యర్థులు సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలి

  • నేరుగా తుది ఫలితాల జాబితా ప్రకటన

  • పోస్టులు మిగిలితే తర్వాతి నోటిఫికేషన్‌లో భర్తీ

  • ఎస్సీ వర్గీకరణ అమలు కానున్న తొలి నోటిఫికేషన్‌

  • ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానికులకు 80 శాతం

  • స్థానికేతర అభ్యర్థులకు 20 శాతం కేటాయింపు

  • వారు టెన్త్‌లో తెలుగు సబ్జెక్టు చదవడం తప్పనిసరి

  • ఈ కోటాలో తెలంగాణ వారికి మాత్రమే అవకాశం

  • హిందీ, ఇంగ్లిష్‌ టీచర్‌ అభ్యర్థులకు ‘తెలుగు’ మినహాయింపు

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): లక్షలాది మంది ఉద్యోగార్థులు ఆశగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపల్‌ స్కూళ్లు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూళ్లు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్‌ సంక్షేమ విభాగంలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఎస్జీటీ పోస్టులకు ఒక నోటిఫికేషన్‌ ఇచ్చింది. మోడల్‌ స్కూళ్లు, సంక్షేమ సొసైటీల్లో పోస్టులకు మరొక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆదివారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు మే 15వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు సంబంధించిన సిలబ్‌సను కూడా పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జూన్‌ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించే పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ‘ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌’ విధానంలో అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారు.


డీఎస్సీ దరఖాస్తులకు ప్రభుత్వం వయోపరిమితిని సడలించింది. 2024 జూలై 1 కటాఫ్‌ తేదీతో 18 నుంచి 44ఏళ్ల వయసున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 49ఏళ్లు, దివ్యాంగులకు 54ఏళ్లుగా నిర్ణయించింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఇవీ అర్హతలు..

స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్‌ పోస్టులకు వేర్వేరుగా అర్హతలను ప్రభుత్వం ప్రకటించింది. గత డీఎస్సీ సమయంలో ఉన్న ఎస్జీటీ పోస్టులకు అర్హత విషయంలో స్పష్టతనిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్జీటీ పోస్టులకు డీఈడీ లేదా డిప్లొమా ఇన్‌ ఎలిమిమెంటరీ ఎడ్యుకేషన్‌ విద్యార్హత కలిగిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్‌లో 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభన్న ప్రతిభావంతులు అయితే 45శాతం మార్కులు సాధించి ఉండాలి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులతో డిగ్రీ, బీఈడీ ఉండాలి. వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టులకు డిగ్రీతో పాటు బీపీఈడీ లేదా ఎంపీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

టెట్‌కు 20శాతం వెయిటేజీ

వ్యాయామ విద్య మినహా స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ పోస్టులకు టెట్‌లో 20శాతం వెయిటేజీ ఉంటుంది. మొత్తం పరీక్షల అనంతరం నార్మలైజేషన్‌ ప్రక్రియ తర్వాత తుది ఫలితాలు ప్రకటిస్తారు.

ఓపెన్‌ కోటా 20శాతం

టీచర్‌ పోస్టుల్లో 80శాతం పోస్టులు స్థానికులకే దక్కుతాయి. మిగిలిన 20శాతం ఓపెన్‌ కోటాగా ఉంటుంది. అందులో స్థానికులు, ఇతర జిల్లాల వారు, ఇతర రాష్ర్టాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర రాష్ర్టాల అభ్యర్థులు పదో తరగతిలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా చదివి ఉండాలి. దీంతో తెలంగాణ వారికి మాత్రమే ఇతర రాష్ర్టాల అభ్యర్థుల కింద అవకాశం దక్కుతుంది. అయితే హిందీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునేవారికి తెలుగుసబ్జెక్టు మినహాయింపు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.


వారికి ఫీజు మినహాయింపు

గత ప్రభుత్వంలో ప్రకటించి మధ్యలో ఆగిపోయిన డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, ఈ డీఎస్సీలో ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తును నింపి అప్‌లోడ్‌ చేయాలి. ఒక్కో పోస్టుకు అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించాలి. అందువల్ల గత డీఎస్సీలో ఒక పోస్టుకు ఫీజు చెల్లించినవారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే, అదనంగా ఎంపిక చేసుకున్న పోస్టులకు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ వర్గీకరణ అమలు

డీఎస్సీలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ రోస్టర్‌ పాయింట్లు కేటాయించింది. ఎస్సీ 1, 2, 3 మూడు కేటగిరీలకూ పోస్టులు వేర్వేరుగా చూపించింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుచేసిన మొదటి నోటిఫికేషన్‌ ఇదే అవుతుంది.

సోషల్‌, ఇంగ్లిష్‌ పోస్టులే ఎక్కువ

మేనేజ్‌మెంట్ల వారీగా పోస్టులు చూస్తే ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో అత్యధికంగా 13,192 పోస్టులున్నాయి. వాటిలో 5,985 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో ప్రథమ భాష స్కూల్‌ అసిస్టెంట్‌ 534, హిందీ 492, ఇంగ్లిష్‌ 1,032, గణితం 655, ఫిజికల్‌ సైన్స్‌ 599, బయలాజికల్‌ సైన్స్‌ 902, సోషల్‌ స్టడీస్‌ 1,329, పీఈటీ 1,664 చొప్పున పోస్టులు ఉన్నాయి. మొదటి నుంచీ టీచర్ల కొరత ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాకే అత్యధిక పోస్టులు కేటాయించారు. ఉమ్మడి కర్నూలులో 2,645 పోస్టులు భర్తీ చేయనున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మొత్తం 881 పోస్టులు ఉండగా, అందులో 601 ఎస్జీటీ ఖాళీలున్నాయి. ఈ విభాగానికి సంబంధించి విశాఖపట్నంలో అత్యధికంగా 400 పోస్టులు ఇచ్చారు. విజయనగరంలో 137, తూర్పుగోదావరిలో 112, శ్రీకాకుళంలో 85 పోస్టులు మంజూరు చేశారు. మొత్తంగా 7,487 స్కూల్‌ అసిస్టెంట్‌, 6,599 ఎస్జీటీ పోస్టులున్నాయి.


మూడు ప్రధాన మార్పులు

ముందే సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయడం, ప్రాధాన్యాలు ఇవ్వడం, ప్రొవిజినల్‌ జాబితా లేకుండా నేరుగా తుది జాబితా ప్రకటించడం అనే మూడు ప్రధాన మార్పులు ఈ డీఎస్సీలో చేశారు.

గతంలో దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. దానివల్ల పరీక్షల అనంతరం సర్టిఫికెట్ల పరిశీలనకు ఎక్కువ సమయం పట్టేది. ప్రస్తుత డీఎస్సీలో దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు అన్ని రకాల అర్హత సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వివరాలు కూడా సమర్పించాలి. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లను తొలుత పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తుంది. అనంతరం సాధారణ విధానంలో పరిశీలన ఉంటుంది.

  • ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ముందే ప్రాధాన్యాలు ఇవ్వాలి. అంటే ఒకే అభ్యర్థి గణితం, సైన్స్‌ రెండు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే తొలుత ఏ పోస్టు కావాలో ప్రాధాన్యం పేర్కొనాలి. తుది ఎంపికలో రెండు పోస్టులకు అర్హత సాధిస్తే తొలి ప్రాధాన్యానికి అనుగుణంగా ఎంపిక చేస్తారు. మిగిలినవి రద్దు అవుతాయి. దీనివల్ల పరీక్షల అనంతరం మళ్లీ ప్రాధాన్యాల ఎంపిక వివాదాలు తలెత్తవు.

  • గతంలో తుది ఫలితాలు ప్రకటించాక కూడా పోస్టులు మిగిలిపోతే డీఎస్సీలో తర్వాత మెరిట్‌ను తీసుకునేవారు. అందుకోసం తొలుత ప్రొవిజినల్‌ జాబితా ప్రకటించేవారు. ప్రస్తుత డీఎస్సీలో నేరుగా తుది జాబితా ప్రకటిస్తారు. పోస్టుకు ఒకరిని చొప్పున ఎంపిక చేస్తారు. ఏవైనా కారణాలతో ఎంపిక చేసినవారు చేరకుండా పోస్టులు మిగిలిపోతే, వాటిని తర్వాత నోటిఫికేషన్‌కు క్యారీ ఫార్వర్డ్‌ చేస్తారు. మెరిట్‌లో తర్వాత వారికి అవకాశం ఇవ్వరు. దీనివల్ల న్యాయ వివాదాలు ఏర్పడవని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Apr 21 , 2025 | 02:59 AM