Crop insurance: బీమాతో ధీమా
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:38 PM
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోకుండా రైతులకు పంటల బీమా కొంత ఊరటనిస్తుంది. ఊహించని విపత్తుల వల్ల ఉత్పన్నమయ్యే పంటనష్టానికి గురైన రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రక్షణ కవచమనే చెప్పవచ్చు. జిల్లాలో పీఎంఎఫ్‌బీవై పథకం కింద 10 పంటలు ఎంపికయ్యాయి.

పంటలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
బీమా నమోదుకు నెలాఖరు దాకా అవకాశం.. కొన్ని పంటలకు ఆగస్టు 15 వరకు..
ఆనందంలో అన్నదాతలు
నంద్యాల ఎడ్యుకేషన్/రుద్రవరం, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోకుండా రైతులకు పంటల బీమా కొంత ఊరటనిస్తుంది. ఊహించని విపత్తుల వల్ల ఉత్పన్నమయ్యే పంటనష్టానికి గురైన రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రక్షణ కవచమనే చెప్పవచ్చు. జిల్లాలో పీఎంఎఫ్‌బీవై పథకం కింద 10 పంటలు ఎంపికయ్యాయి. వరి, మొక్కజొన్న, కంది, మి నుము, మిరప, జొన్న, సజ్జలు, కొర్ర, ఆముదం ఉల్లి పంటలకు బీమా సౌకర్యం కల్పించారు. వరి పంటకు మినహా ఇతర పంటలకు బీమా చేయించడానికి ఈనెల 31 వరకు అవకాశం ఉంది. వరితో పాటు వాతావరణ ఆధారిత బీమా పథకం కింద జిల్లాలో పత్తి, వేరుశనగ, నిమ్మ, అరటి పంటలకు బీమాకు నమోదు చేసుకోవడానికి ఆగస్టు 15వరకు అవకాశం ఉంది. వరికి గ్రామాన్ని యూనిట్‌గా, అరటి, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, కంది, మినుము, మిరప పంటలకు మండలాన్ని యూనిట్‌గా, జొన్న, సజ్జలు, కొర్రలు, ఆముదం, ఉల్లి పంటలను జిల్లా యూనిట్‌గా తీసుకున్నారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా సౌకర్యం కల్పించడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రీమియం వివరాలివి..
వరి పంటకు రైతు హెక్టారుకు రూ.2వేలు ప్రీమియం చెల్లిస్తే రూ.లక్ష బీమా వర్తిస్తుంది. మొక్కజొన్నకు రూ.1650 చెల్లిస్తే రూ.82,500, కంది పంటకు రూ.1000 చెల్లిస్తే రూ.50వేలు, మినము పంటకు రూ.475లు చెల్లిస్తే రూ.47,500 బీమా వర్తిస్తుంది. అలాగే మిరపకు హెక్టార్‌కు రూ.7200 చెల్లిస్తే రూ.2,25,000, జొన్నకు రూ.475 చెల్లిస్తే రూ.47,500, సజ్జ, కొర్ర, ఆముదం పంటలకు రూ.400లు చెల్లిస్తే రూ.40వేలు బీమా వర్తిస్తుంది. ఉల్లి పంటకు హెక్టార్‌కు రూ.1125 చెల్లిస్తే రూ.1,12,500, అరటికి రూ.6875 చెల్లిస్తే రూ.1,37,500, పత్తికి రూ.4వేలు చెల్లిస్తే రూ.లక్ష, వేరుశనగకు రూ.1400 చెల్లిస్తే రూ.70వేలు బీమా వర్తిస్తుంది.
కావాల్సిన పత్రాలు
రైతులు బీమా ప్రీమియంను స్థానిక రైతు సేవా కేంద్రాల్లో చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధీకృత కంపెనీగా వ్యవహరిస్తుండగా, వాతావరణ ఆధారిత బీమా పథకానికి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అధీకృత కంపెనీగా వ్యవహరిస్తోంది. రైతులు వారి ఆధార్ కార్డు, సొంత భూములు కల్గిన రైతులు అయితే పొలం పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, స్థానిక వ్యవసాయ సహాయకులు ఇచ్చిన పంట ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకెళ్లి బీమా కోసం నమోదు చేయించుకోవాలి. కౌలుదారులు వాటితో పాటు వారికి ప్రభుత్వం అందజేస్తున్న కౌలుకార్డును తీసుకెళ్లి బీమా చేయించుకోవాలి.
బీమా చేయించుకోవాలి
పంట వేసిన ప్రతి రైతు తప్పకుండా ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవాలి. అధిక వర్షాలతో కాని, విపత్తులతో కాని పంటలు నష్టపోయినప్పుడు బీమా రైతుకు ఎంతో అండగా నిలుస్తుంది. ప్రతి రైతు సేవాకేంద్రంలోనూ, పొలం పిలుస్తోంది కార్యక్రమంలోనూ బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
-వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి, నంద్యాల
నాలుగు ఎకరాల్లో అరటి సాగుచేశా
నాలుగు ఎకరాల్లో అరటి పంటను సాగు చేశా. ప్రభుత్వం బీమా వర్తింపజేయడం సంతోషంంగా ఉంది. గతంలో బీమా లేక నష్టపోయాం. ఈ సారి బీమా వర్తించడంతో ధైర్యంగా పంట సాగుకు ముందడుగు వేశా.
-దస్తగిరి, ఆలమూరు, రుద్రవరం మండలం
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో దారుణం.. 'జై జగన్' అని అనలేదని బట్టలు విప్పి..!
సీపీఐ నేతపై కాల్పులు... నిందితులను గుర్తించిన పోలీసులు
Read Latest AP News And Telugu News