YS Sharmila Congress Protest: దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా బయటకు వస్తాయ్: షర్మిల
ABN , Publish Date - Nov 06 , 2025 | 01:15 PM
హర్యానాలో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టారని తేలిందని షర్మిల తెలిపారు. సర్వేలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇచ్చాయని గుర్తుచేశారు. అయినా బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధి బయట పెట్టారన్నారు.
విజయవాడ, నవంబర్ 6: బీజేపీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ (Congress) సంతకాల సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను హస్తం నేతలు ట్రక్కులో ఢిల్లీకి పంపించారు. ఈరోజు (గురువారం) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila).. ట్రక్కును జెండా ఊపి ప్రారంభించారు. ఓట్ చోర్... గద్దీ చోర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నిన్న హైడ్రోజన్ బాంబ్ పేల్చారని.. దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా రాహుల్ గాంధీ బయటకు తీస్తున్నారని తెలిపారు. హర్యానాలో రెండు కోట్ల ఓట్లు ఉంటే.. 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని.. ఎనిమిది మందికి ఒక దొంగ ఓటు చేర్చారని అన్నారు. లక్షా 18 వేల ఓట్ల తేడాతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని షర్మిల అన్నారు.
అయితే 25 లక్షల దొంగ ఓట్లు చేర్చారు కాబట్టే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అంటే దొంగ ఓట్లు లేకుంటే బీజేపీకి అధికారంలేదన్నారు. హర్యానాలో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టారని తేలిందని షర్మిల తెలిపారు. సర్వేలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇచ్చాయని గుర్తుచేశారు. అయినా బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధి బయట పెట్టారన్నారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్‌గా పని చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అన్ని వ్యవస్థలను ఇప్పటికే భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా భ్రష్టు పట్టేలా చేసిందని మండిపడ్డారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారని విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపాడటానికి పోరాటం చేశారన్నారు. దేశ వ్యాప్తంగా ఆయన పోరాటం చేస్తున్నారని అన్నారు. ఓటర్ల జాబితా డిజిటర్ రూపంలో ఇవ్వాలని కోరినా స్పందన లేదన్నారు. కాంగ్రెస్‌కు బలం ఉన్న ప్రాంతాల్లో దొంగ ఓట్లు ఎక్కించారని ఆరోపించారు. ఇలా అనేక రాష్ట్రాల్లో దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ మొదలు పెట్టామని.. అన్ని రాష్ట్రాల సంతకాలను రామ్ లీలా మైదానానికి తెస్తామన్నారు. అక్కడ నుంచి రాష్ట్రపతికి అందజేయనున్నట్లు వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఎస్వీయూ పీఎస్ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న విద్యార్థులు
తప్పు చేస్తే ఏ పార్టీ వ్యక్తి అయినా చర్యలు తప్పవు: హోంమంత్రి
Read Latest AP News And Telugu News