Somu Veerraju: బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవు: సోము వీర్రాజు
ABN , Publish Date - Jul 01 , 2025 | 02:42 PM
బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవని ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. మాధవ్ వ్యక్తిగతంగా నిజమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారని అన్నారు. ఆయన ఆలోచనల్లో ఒక బాణి, ఒక వాణి ఉంటుందని ప్రశంసించారు.

విజయవాడ: ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చిన్న వయసు నుంచే రాజకీయాల్లో ఉన్నారని ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు (Somu Veerraju) పేర్కొన్నారు. పీవీఎన్ మాధవ్‌కు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కేంద్ర పెద్దలకు సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ(మంగళవారం) విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పీవీఎన్ మాధవ్ ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. మాధవ్ తండ్రి చలపతిరావు ఉమ్మడి ఏపీలో బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారని గుర్తుచేశారు. తండ్రి అడుగుజాడల్లో నడిచిన మాధవ్ బీజేపీ కోసం పనిచేశారని తెలిపారు. ఇప్పుడు మాధవ్ కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని చెప్పుకొచ్చారు. నాడు తండ్రి, నేడు తనయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయడం గొప్ప విషయమని ఉద్ఘాటించారు సోము వీర్రాజు.
బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవని సోము వీర్రాజు స్పష్టం చేశారు. మాధవ్ వ్యక్తిగతంగా నిజమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారని అన్నారు. ఆయన ఆలోచనల్లో ఒక బాణి, ఒక వాణి ఉంటుందని ప్రశంసించారు. తాను మాధవ్‌ను ఎప్పటి నుంచో గమనిస్తున్నానని అన్నారు. ఆయన పని తీరును ఇప్పుడు అందరూ చూస్తారని తెలిపారు. మాధవ్ నేతృత్వంలో ఏపీలో బీజేపీ తప్పకుండా బలోపేతం అవుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ అధ్యక్షుడిగా పూర్తి స్థాయి సామర్థ్యం ఉన్న నేత మాధవ్ అని కొనియాడారు. దేశం దశ, దిశ మార్చేలా దీక్షతో పని చేసే పార్టీ బీజేపీ అని అభివర్ణించారు. ఏపీలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వచ్చి తీరుతుందని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.
ఆ దిశగా ఏపీ బీజేపీ ఎదగాలి: ఎంపీ సీఎం రమేశ్
ఏపీ బీజేపీనే సొంతం ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఎదగాలని ఎంపీ సీఎం రమేశ్ ఆకాక్షించారు. పీవీఎన్ మాధవ్‌ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించడానికి సహకరించిన పార్టీ హై కమాండ్‌కి ధన్యవాదాలు తెలిపారు. మాధవ్ కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరికీ అందుబాటులో ఉంటారని ఉద్ఘాటించారు. పార్టీని బలోపేతం చేసేలా మాధవ్ కృషి చేస్తారని వెల్లడించారు. టీడీపీ, జనసేనకు జరిగినట్లు బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని అన్నారు. కూటమి నేతలతో ఈ అంశాలను మాధవ్ చర్చించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరుగుతుండటంతో బీజేపీ కేడర్‌ను సిద్దం చేయాలని ఎంపీ సీఎం రమేశ్ సూచించారు.
ఇవి కూడా చదవండి:
రెండు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల వర్షం..
For More AP News and Telugu News