Minister Narayana: సోషల్ మీడియాలో రైతుల పోస్టులపై మంత్రి నారాయణ రియాక్షన్
ABN , Publish Date - Nov 21 , 2025 | 09:45 AM
రాజధాని అమరావతిలో రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై కొందరు రైతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై మంత్రి స్పందించారు.
అమరావతి, నవంబర్ 21: రాజధానిలోని వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెంలో మంత్రి నారాయణ ఈరోజు (శుక్రవారం) ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా సిటీస్ (CITIIS)ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్స్ భవనాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... అమరావతిలో సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా 15 అంగన్వాడీ భవనాలు, 14 పీహెచ్‌సీ భవనాలు, 14 స్కూల్స్, ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మించామన్నారు. వీటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్యా, వైద్య సదుపాయాలు అందుతాయని వెల్లడించారు.
రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌళిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. రాజధానిలో మొత్తం 69,421 మంది రైతులకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయన్నారు. ఇంకా కేవలం 2270 మంది రైతులకు 7988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. ప్రతి రోజూ 30 నుంచి 40 రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయని అన్నారు. గత 21 రోజుల్లో 231 మందికి 443 ప్లాట్ల రిజిస్ట్రేషన్లను పూర్తి చేశామని మంత్రి తెలిపారు. మొత్తం 30,635 మంది రైతులలో 29,644 మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. ఇంకా 991 మంది రైతులకు మాత్రమే ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
కొందరు రైతులు తమకు కావలిసిన చోటే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని అడుగుతున్నారని.. ఒకరిద్దరు రైతులు అనవసరంగా సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్‌లు పెట్టారని అన్నారు. రాజధాని రైతులకు ఎవరికీ అన్యాయం జరగదని.. రైతులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని మంత్రి నారాయణ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం
మీన రాసి.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన మత్స్య సంపద
Read Latest AP News And Telugu News