Cyber fraud Regulation: సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్‌లను అరికట్టేలా చట్టాల్లో మార్పులు: రఘురామకృష్ణంరాజు
ABN , Publish Date - Jul 18 , 2025 | 02:50 PM
Cyber fraud Regulation: సైబర్ క్రైమ్‌ను అరికట్టగలిగితే బాధితుల డబ్బును ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా అడ్డుకోవచ్చని రఘురామకృష్ణంరాజు అన్నారు. బాధితులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి, జులై 18: సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్‌లను అరికట్టే అంశాలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Deputy Speaker Raghu Rama Krishnamraju) ఆధ్వర్యంలో పిటిషన్ కమిటీ ఈరోజు (శుక్రవారం) సమావేశమైంది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్‌లను అరికట్టేందుకు పటిష్టమైన చట్టాలు అవసరమన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని మరింత పదును పెట్టేలా మార్పులు, చేర్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ చట్టానికి సవరణలు చేస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేలా కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
సైబర్ నేరాలను అరికట్టగలిగితే బాధితుల డబ్బును ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా అడ్డుకోవచ్చన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో బాధితులు మోసపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్‌లు తయారు చేసేవారిపై.. వాటిని ప్రమోట్ చేసే వారిపైనా కేసులు తప్పవని హెచ్చరించారు. సైబర్ క్రైమ్‌ను అరికట్టేందుకు ఐటీ నాలెడ్జ్ ఉన్న పోలీసు యంత్రాంగం అవసరమన్నారు. బాధితులు 1930కి వెంటనే ఫిర్యాదు చేయాలని చెప్పారు. ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు.
సైబర్ చట్టాలకు సవరణ చేస్తాం: పల్లా
సైబర్ నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన చట్టం తీసుకువస్తామని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. తెలియని లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయరాదని ఆయన చెప్పారు. ఓటీపీలను తెలియని వ్యక్తులకు ఇవ్వరాదన్నారు. సైబర్ చట్టాలు సవరణ చేస్తామని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, గురజాల జగన్ హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
2047 నాటికి నెం 1గా తెలుగు జాతి: నిమ్మల రామానాయుడు
తెలంగాణకు రేవంత్ అన్యాయం చేయలేదు: నారాయణ
Read latest AP News And Telugu News