Share News

Bonda Uma: రండి తేల్చుకుందాం.. వైసీపీ నేతలకు బోండా ఉమ మాస్ సవాల్

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:44 PM

ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ గుర్తు ఉందని, తప్పకుండా అమలు చేసి తీరుతామని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రూ. 240 కోట్లతో సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని బోండా ఉమ పేర్కొన్నారు.

Bonda Uma: రండి తేల్చుకుందాం.. వైసీపీ నేతలకు బోండా ఉమ మాస్ సవాల్
Bonda Umamaheswara Rao

విజయవాడ: ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అన్ని సంక్షేమ ‌పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) ఉద్ఘాటించారు. ఇవాళ(బుధవారం) సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అడిగి తెలుసుకున్నారు. ప్రజలను కలిసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో అంతా‌ బాగుందని, సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న డ్రైనేజి, ఇతర సమస్యలు వెంటనే పరిష్కారించాలని అధికారులకు బోండా ఉమ సూచించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మీడియాతో మాట్లాడారు.


కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని బోండా ఉమామహేశ్వరరావు చెప్పుకొచ్చారు. నేటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజుల‌పాటు నిర్వహిస్తామని వెల్లడించారు. 267 పోలింగ్ స్టేషన్ల పరిధిలో తమ నియోజకవర్గంలో ప్రజల మధ్య తాము ఉన్నామని చెప్పారు. మై టీడీపీ యాప్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారని అన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి పెంచి, జవాబుదారీతనంతో ఉంటామని ఉద్ఘాటించారు. అధికారం‌లో ఉన్నా లేకున్నా.. తాము ఎప్పుడూ ప్రజల ముందుకు వస్తూనే ఉన్నామని తెలిపారు. రూ. 240 కోట్లతో సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం, స్త్రీ నిధిని ఈ ఏడాది ఆగస్టు నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ గుర్తు ఉందని, తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు బోండా ఉమామహేశ్వరరావు.


నేడు దిక్కుతోచని పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారని బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. తమ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంతో వాళ్లు తట్టుకోలేక‌ పోతున్నారని అన్నారు. వైసీపీ నేతలు మీడియా ముందు విమర్శలు చేయడం సరికాదని.. ప్రజల వద్దకు రండి.. ‌తమ ప్రభుత్వం వల్ల ఏమి అందలేదో చెప్పాలని సవాల్ విసిరారు. ప్రజల ఇంటి ముందుకు వచ్చి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. వైసీపీ నేతలకి కూటమి ప్రభుత్వ హామీల అమలు గురించి అడిగే నైతిక అర్హత కూడా లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం నిజమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వెల్లడించారు. అసలు హామీలు అమలు‌ చేయకుండా మోసం చేసిందే గత జగన్ ప్రభుత్వమని బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం

రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

For More AP News and Telugu News

Updated Date - Jul 02 , 2025 | 03:11 PM