Adinarayana Challenge Jagan: భవిష్యత్‌లో వైసీపీ కనుమరుగవడం ఖాయం: బీజేపీ ఎమ్మెల్యే
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:57 PM
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆదినారాయణ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. వైసీపీ అంతమయ్యే పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు.
విజయవాడ, నవంబర్ 8: మాజీ సీఎం జగన్‌పై (Former CM YS Jagan) బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి (BJP MLA Adinarayana Reddy) ఫైర్ అయ్యారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, వైసీపీ చేసిన అవినీతిపై ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడానని.. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, మోసాలను, దోపిడీని ప్రస్తావించినట్లు తెలిపారు. దీంతో కొంతమంది వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు తనపైన వ్యక్తిగత దూషణలు చేశారని మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా వేదికగా తనపై అబద్ధాలు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. జగన్ మెప్పు పొందేందుకు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. అనవసరంగా, అన్యాయంగా, వ్యక్తిగతంగా విమర్శలు చేశారన్నారు. తనపై అనవసరంగా నోరు పారేసుకున్న నాయకులకు తప్పకుండా సమాధానం చెబుతానని వార్నింగ్ ఇచ్చారు. గత ఐదేళ్లలో అడ్డగోలుగా దోచుకున్న అవినీతి వ్యవహారాన్ని మొత్తాన్ని బయటపెడుతానంటూ హెచ్చరించారు. టైంపాస్ రాజకీయాలు చేయననని.. రాష్ట్రం, ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఆకాంక్ష అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అభివృద్ధిని ఓర్చుకోలేక...
గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమిలో అభివృద్ధి జరుగుతుందనేది వాస్తవమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రధాని మోడీ సహకారంతో ఏపీ అన్ని విధాల అభివృద్ధి చెందుతోందన్నారు. నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. బనకచర్ల ద్వారా గోదావరి నీళ్లు రాయలసీమకు కూడా అందిస్తున్నారని తెలిపారు. మోడీ సహకారం, చంద్రబాబు పట్టుదల వల్ల అనేక ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. అమరావతి, విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్‌ల ఆధునీకరణ, జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతంగా జరుగుతోందన్నారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అనేది వాస్తవమని తెలిపారు. ఇటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేని జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం మీద, ప్రజలపైన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని.. వైసీపీ అన్యాయాలు, అక్రమాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. వైసీపీ అంతరించిపోయే పార్టీ అని అందుకే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ బుద్ధి చెప్పడం ఖాయం...
భవిష్యత్తులో వైసీపీ కనుమరుగైపోవడం ఖాయమని స్పష్టం చేశారు. జగన్ హయాంలో ప్రభుత్వ సంపదను దోచుకుని, దాచుకున్నారని ఆరోపించారు. నిందలు ఎదుటి వాళ్ల మీద వేసి ప్రచారం చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఐదేళ్లు అడ్డగోలుగా రాష్ట్రాన్ని పాలించి.. జగన్ ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. వేల కోట్ల రూపాయలతో కడప జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని ఆపే దమ్ము జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని అన్నారు.
ఊహించని విధంగా అభివృద్ధి...
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులను జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే గుండెపోటు అని సాక్షిలో వేశారని.. తర్వాత అత్యంత ఘోరంగా అతన్ని చంపించినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. కోడి కత్తి కేసు, గులక దాడి ఘటన అంతా డ్రామా అని వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన తప్పులకు అన్యాయాలకు అంతే లేకుండా పోతుందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి చేయడం, నోరు పారేసుకోవటం వైసీపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. కూటమి పెరిగి పెరిగి విస్తరిస్తోందని... వైసీపీ తరిగి తరిగి అంతరించిపోతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఏది అనేది వారే ఆలోచించుకోవాలని అన్నారు. వచ్చే రెండేళ్లల్లో రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఎవరు ఊహించలేరన్నారు. ఈ అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేక ఇంట్లో నుంచి కూడా రాలేరని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం పండుతుందని.. వైసీపీ ఎండుటాకులా ఎండిపోతుందంటూ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు.
జగన్‌కు సవాల్...
‘అభివృద్ధి, అరాచకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి చర్చకు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. స్థలం. సమయం వారు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. ఏపీ రాజధాని అమరావతి వేదికగా వచ్చినా నేను చర్చకు సిద్ధం. రాష్ట్రాన్ని నాశనం చేసిన మీ వైసీపీ అడ్రస్ గల్లంతు అవుతుంది. ఆస్తుల కోసం తల్లి, చెల్లిని గెంటేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అవినీతి డబ్బుతో అడ్డగోలుగా వ్యవహరిస్తూ అనేక ప్రాంతాల్లో ప్యాలెస్లు కట్టుకున్నాడు. తండ్రిని అడ్డం పెట్టుకొని దోచుకున్న సొమ్ముతో ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు. పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టని జగన్ రాజీనామా చేయాలి’ అంటూ ఎమ్మెల్యే ఆదినారాయణ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
అర్ధరాత్రి నడిరోడ్డుపై మందుబాబుల హంగామా.. ఏం జరిగిందంటే
అనుకున్న సమయానికే అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్: చంద్రబాబు
Read Latest AP News And Telugu News