CM Chandrababu On Quantum Computer: అనుకున్న సమయానికే అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్: చంద్రబాబు
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:06 PM
క్వాంటమ్ కంప్యూటర్‌కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్‌ను తీసుకొచ్చేందుకు అంతా సిద్ధంగా ఉందని తెలిపారు.
అమరావతి, నవంబర్ 8: విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సు ఈసారి నిర్మాణాత్మకంగా జరగనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. ప్రెజెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఎగ్జిబిషన్, ఒప్పందాలు ఇలా వివిధ రూపాల్లో రెండు రోజుల పాటు సదస్సు సాగనుందన్నారు. ప్రజలకు అధునాతన అవసరాలు, అత్యాధునిక సాంకేతిక అంశాలపై అధ్యయనం కూడా ఉంటుందని తెలిపారు.
ప్రతి వ్యక్తి అకౌంటబిలిటీ పరిధిలోకి వచ్చి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వీఆర్వోల వరకూ బాధ్యతగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. ఈ విధానం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలకు, పెట్టుబడుల సదస్సుకు సంబంధం లేకుండా దేనికదే విడివిడిగా నడుస్తాయన్నారు. పెట్టుబడుల సాధనలో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చే ప్రముఖులు, పెట్టుబడిదారులకు విశాఖ సదస్సు కొత్త అనుభూతినిస్తుందని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని.. ఇక షిప్మెంటే మిగిలిందని వెల్లడించారు. అనుకున్న సమయానికి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా అడ్డంకులు అధిగమిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
జాగ్రత్తగా పరిష్కరిస్తాం...
సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదో.. బాధితుడికి స్పష్టంగా అర్థమయ్యేలా తెలిపే విధానం తెస్తామన్నారు. కిందిస్థాయిలో ఉన్న అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని సీఎం తెలిపారు. ముందు పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించాల్సి ఉందని.. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రెవెన్యూ అంశాలు సంక్లిష్టంగా మారాయని అన్నారు. సున్నితమైన అంశాలను జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉందని చెప్పుకొచ్చారు.
ప్రజాదర్బార్‌లు నిర్వహించాల్సిందే..
22ఏ నిషేధిక జాబితా భూములపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.ఎమ్మెల్యేలు విధిగా ప్రజాదర్బార్‌లు నిర్వహించాల్సిందే అని... ప్రజా సమస్యలు పట్టించుకోమంటే కుదరదని స్పష్టం చేశారు. లోకేష్ ఆదేశాల తర్వాత ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చి అన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్‌లు నిన్న జరిగాయన్నారు. సమస్య తన వద్దకు వస్తేనే పరిష్కారమవుతుందనే భావన ఉండకూడదని అన్నారు. ప్రతీ సమస్య ఎక్కడికక్కడ పరిష్కారమయ్యే వ్యవస్థను ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఏపీ దూసుకెళ్తోంది...
అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని.. హైదరాబాద్ స్థాయిలో ఇక్కడా భారీ ఈవెంట్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో భారీ ఈవెంట్లను ప్రోత్సహిస్తోందన్నారు. థమన్ మ్యూజికల్ నైట్, విజయవాడ ఉత్సవ్, ప్రస్తుతం జరుగుతున్న ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటివి అమరావతికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్నాయని పేర్కొన్నారు. ఓ వైపు భారీ ఈవెంట్లు, మరోవైపు భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోందన్నారు. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్.. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో దాదాపు 6 వేల కోట్ల పెట్టుబడి పెడుతుండటం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కమిటీలను వీలైనంత వరకు నెలాఖరులోగా పూర్తి చేస్తామని... పార్లమెంట్ కమిటీల మీద కసరత్తు ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి అన్ని కమిటీలు పూర్తి చేసి పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహిత ఎంత పని చేసిందంటే..
అర్ధరాత్రి నడిరోడ్డుపై మందుబాబుల హంగామా.. ఏం జరిగిందంటే
Read Latest AP News And Telugu News