Drunk Men Attacked Constables: అర్ధరాత్రి నడిరోడ్డుపై మందుబాబుల హంగామా.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:39 PM
అర్ధరాత్రి నడిరోడ్డుపై మందుబాబులు నానా హంగామా చేశారు. ఏకంగా కానిస్టేబుళ్లపైనే దాడికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పశ్చిమగోదావరి, నవంబర్ 8: మందుబాబుల వీరంగం అంతాఇంతా కాదు. ఫుల్‌గా మద్యం సేవించి ఆ మత్తులో దారుణాలకు పాల్పడుతుంటారు. మద్యం మత్తులో ఏం చేస్తుంటారో.. ఏ విధంగా ప్రవర్తిస్తుంటారో వారికే తెలియని పరిస్థితి. అర్ధరాత్రులు నడిరోడ్డుపై మద్యం సేవించి వాహనదారుల వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి వీరి ఆగడాలు శృతిమించిపోతుంటాయి. ఇప్పుడ మనం చెప్పుకోబోయే వార్త కూడా అలాంటిదే. ఇక్కడ మందుబాబులు ఏకంగా పోలీసులపైనే దాడికి పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లాలో (West Godavari) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్స్‌పై మందుబాబులు దాడి చేశారు. గత నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద అర్ధరాత్రి నడిరోడ్డుపై కూర్చుని ముగ్గురు యువకులు మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన బీట్ కానిస్టేబుల్స్.. మందు బాబులను ప్రశ్నించారు. నడిరోడ్డుపై ఇలా తాగడం ఏంటని నిలదీశారు. దీంతో సదరు యువకులు రెచ్చిపోయారు. పోలీసులనే భయం లేకుండా కానిస్టేబుల్స్‌పై దాడికి పాల్పడ్డారు. రాకేష్ అలియాస్ సాయి, నజీరుద్దీన్, నూర్ భాషా అనే ముగ్గురు యువకులు.. బీట్ కానిస్టేబుల్స్‌పై దాడి చేశారు.
ఈ దాడిని వీడియో చిత్రీకరిస్తున్న కానిస్టేబుల్ సెల్‌ఫోన్‌ను యువకులు తీసుకుని విచక్షణారహితంగా నేలకేసి కొట్టి పగులగొట్టారు. అయితే కానిస్టేబుళ్లపై దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. యువకుల దాడిలో కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారు ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. అనంతరం జరిగిన ఘటనను పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పరారీలో ఉండి ముందస్తు బెయిల్‌కు సదరు యువకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
ఏపీలో పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురు స్పాట్‌డెడ్
ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహిత ఎంత పని చేసిందంటే..
Read Latest AP News And Telugu News