Tragic Accident Hyderabad: మద్యం సేవించి ట్రాక్టర్ కింద పడుకున్నాడు.. తెల్లారేసరికి ఘోరం
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:01 PM
రామాంతపూర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ట్రాక్టర్ కింద పడుకున్నాడు. తెల్లారేసరికి ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, నవంబర్ 8: మద్యం మత్తులో మందు బాబులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అతిగా మద్యం సేవించి నానా హంగామా చేస్తుంటారు. ఒక్కోసారి వారు ప్రవర్తించే తీరు ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తుంటుంది. మందు నిషాలో ఇతరులపై దాడులకు పాల్పడటమే కాకుండా ప్రాణాలు కూడా తీస్తుంటారు. అంతే కాకుండా అధికంగా మద్యం సేవించి ప్రమాదం బారిన కూడా పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బంధువుల ఇంట్లో పెళ్లి కోసం వచ్చి ఫుల్‌గా మందేశాడు. ఆ తరువాత అతను చేసిన పని కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఏం జరిగిందో చూద్దాం.
నగరంలోని రామాంతపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శేఖర్ అనే వ్యక్తి బంధువుల ఇంట్లో పెళ్లికి వచ్చాడు. పెళ్లి అనంతరం బార్‌లోకి వెళ్లి మద్యం సేవించాడు. ఆ తరువాత మద్యం మత్తులోనే అక్కడే ఉన్న ఓ ట్రాక్టర్ కింద పడుకున్నాడు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున ట్రాక్టర్ నడిపే వ్యక్తి పనికి వెళ్లేందుకు ట్రాక్టర్‌ను తీశాడు. అయితే ట్రాక్టర్ కింద శేఖర్ ఉన్న విషయాన్ని అతడు గుర్తించలేదు. దీంతో ట్రాక్టర్ చక్రాల కింద శేఖర్ నలిగిపోయాడు.
వ్యక్తి అరుపు వినడంతో కిందకు దిగి చూసిన ట్రాక్టర్ యజమానికి శేఖర్ టైర్స్ కింద పడి ఉండటాన్ని గుర్తించాడు. అయితే అప్పటికే జరగాల్సి ఘోరం జరిగిపోయింది. తీవ్రంగా గాయపడిన శేఖర్ స్పాట్‌లోనే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా బంధువుల ఇంట పెళ్లికి వచ్చిన వ్యక్తి ట్రాక్టర్ కింద పడి మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన..
రూ.60,799 కోట్లతో కొత్త రోడ్లు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్
Read Latest Telangana News And Telugu News