Chevireddy SIT Custody: జైలు ప్రాంగణంలో చెవిరెడ్డి అరుపులు.. తప్పుడు కేసులంటూ హడావుడి
ABN , Publish Date - Jul 03 , 2025 | 09:41 AM
Chevireddy SIT Custody: గత రెండు రోజుల విచారణలో సిట్‌కు చెవిరెడ్డి ఏమాత్రం సహకరించనట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినప్పటికీ మాజీ ఎమ్మెల్యే సరైన సమాధానం చెప్పనట్లు సమాచారం.

విజయవాడ, జులై 3: ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam Case) వరుసగా మూడో రోజు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Former MLA Chevireddy Bhaskar Reddy), వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే మూడో రోజు కూడా జైలు ముందు అదే సీన్ రిపీట్ అయ్యింది. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే చెవిరెడ్డి మరోసారి హంగామా చేశారు. జైలు ప్రాంగణంలో అరుపులతో హడావుడి చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని.. అవి నిలబడవన్నారు. తప్పులు కేసులు పెట్టిన వారికి ఏదో ఒక రోజు తప్పకుండా శిక్ష పడుతుందంటూ పోలీసు వ్యాన్ ఎక్కారు చెవిరెడ్డి. అయితే గత రెండు రోజుల విచారణలో సిట్‌కు చెవిరెడ్డి ఏమాత్రం సహకరించనట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినప్పటికీ మాజీ ఎమ్మెల్యే సరైన సమాధానం చెప్పనట్లు సమాచారం. ఇక ఈరోజుతో చెవిరెడ్డి కస్టడీ ముగియనుంది. దీంతో ఈరోజు అయినా ఆయన నుంచి సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.
గత రెండు రోజులుగా సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్న సమయంలో జైలు ప్రాంగణంలో చెవిరెడ్డి హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. తనను అన్యాయంగా కేసులో ఇరికించారని, తాను ఏ తప్పు చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చార ఎవరినీ విడిచిపెట్టమంటూ హెచ్చరికలు చేశారు మాజీ ఎమ్మెల్యే. ఈరోజు కూడా అదే తీరుగా ప్రవర్తిస్తూ చెవిరెడ్డి పోలీసు జీపు ఎక్కారు. విజయవాడ జిల్లా జైలు నుంచి సిట్ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే, వెంకటేష్ నాయుడులను అధికారులు తరలించారు. ఈరోజు సాయంత్ర వరకు విచారణ జరుగనుంది.
కాగా.. మరింత లోతుగా విచారించేందుకు చెవిరెడ్డిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. అయితే మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో జూలై 1 నుంచి చెవిరెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నేటితో కస్టడీ ముగియనుంది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ38గా ఉన్నారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పీఏలు బాలజీ, నవీన్‌లను కూడా సిట్ పోలీసులు ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
క్యాడర్‌ను కదిలించని జగన్ పిలుపు
Read latest AP News And Telugu News