YCP Jagan: 9న జగన్ మామిడి రైతు పరామర్శ యాత్ర
ABN , Publish Date - Jul 03 , 2025 | 07:15 AM
చిత్తూరు జిల్లా బంగారుపాళేనికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ 9న రానున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

చిత్తూరు జిల్లా బంగారుపాళెంకు రానున్న వైసీపీ అధినేత
తిరుపతి(జీవకోన), జూలై 2(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా బంగారుపాళేనికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ 9న రానున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో బుధవారం ఆయన ఉమ్మడి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. చిత్తూరులో ప్రసిద్ధి చెందిన మామిడిని కొనేవారే లేరని, తూతూమంత్రంగా ప్రభుత్వం టన్నుకు రూ.4,000 గిట్టుబాటు ధర ప్రకటించిందని విమర్శించారు. మామిడికాయలను రైతులు రోడ్డుపక్కన పడేసే పరిస్థితి వచ్చిందన్నారు.
ఇంతటి దారుణ పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు. గతంలో కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర లభించని సమయంలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసి అండగా నిలిచాయన్నారు. చిత్తూరు జిల్లాలో తాను పల్ప్ సిండికేట్ చేసుంటే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో 9న బంగారుపాళెం మార్కెట్ యార్డుకు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వచ్చి మామిడి రైతుల కష్టాలను తెలుసుకుంటారన్నారు.