Rajampet Town Development: పేట.. అభివృద్ధిలో చోటా..!
ABN , Publish Date - Nov 22 , 2025 | 08:11 AM
రాజంపేట పట్టణం అభివృద్ధిలో తిరోగమన దిశలో పయనిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంగా, వందేళ్లుగా ఐఏఎస్ కేడర్ కలిగిన సబ్ కలెక్టర్ కార్యాలయ కేంద్రంగా ఎంతో పేరు గడించిన రాజంపేట పట్టణం కాలానికి తగినట్లు అభివృద్ధికి దూరంగా ఉంది.
రాజంపేట, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాజంపేట పట్టణం అభివృద్ధి (Rajampet Town Development)లో తిరోగమన దిశలో పయనిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంగా, వందేళ్లుగా ఐఏఎస్ కేడర్ కలిగిన సబ్ కలెక్టర్ కార్యాలయ కేంద్రంగా ఎంతో పేరు గడించిన రాజంపేట పట్టణం కాలానికి తగినట్లు అభివృద్ధికి దూరంగా ఉంది. అన్నమయ్య నడియాడిన రాజంపేట పట్టణం బ్రిటీషు కాలంలోనే సబ్ కలెక్టర్ కార్యాలయ కేంద్రంగా నెలకొల్పబడి సబ్ డివిజన్ కేంద్రంగా ఎంతో గుర్తింపు పొందింది.
అటువంటి పట్టణంలో అన్ని రకాల అభివృద్ధి నిరోధక పట్టణంగా తయారైంది. గతంలో 17 మండలాల సువిశాల సబ్ కలెక్టర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం ఆ తర్వాత బద్వేల్ డివిజన్ ఏర్పాటు కావడంతో ఆరు మండలాలు తగ్గి కేవలం 11 మండలాలకే పరిమితమైంది. సుమారు లక్ష జనాభా కలిగి చుట్టూ 8 కిలోమీటర్లలో విస్తరింపబడిన పట్టణంలో కనీస వసతులు లేకుండా పోయాయి. 15 ఏళ్లుగా ఒక్క ఆ భివృద్ధి కార్యక్రమం పట్టణంలో జరగలేదు. జగన్ ప్రభుత్వ హయాంలో పట్టణంలో వంద కోట్ల అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ నేతలు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయారు.
రాజంపేట పట్టణంలో 29 వార్డులున్నాయి. ఒక్కో వార్డులో 2 వేల నుంచి 3 వేల జనాభా ఉంది. ఇంత పెద్ద పట్టణంలో ఇంతవరకు రోడ్ల విస్తరణ జరగలేదు. రోడ్ల వెడల్పు చేయకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రధానంగా పోస్టాఫీసు నుంచి పాతబస్టాండు నుంచి రైల్వేస్టేషన్ వరకు మొత్తం ఆక్రమణలతో రహదారిలో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నిత్యం పట్టణంలో కోడూరు, తిరుపతి, చెన్నై, కడప, హైదరాబాద్, రాయచోటి, కదిరి, బెంగళూరు, నెల్లూరు, గూడూరు, విజయవాడ చుట్టుపక్కల అనేక ప్రధాన నగరాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు వందలాదిగా వెళుతుంటాయి.
ఇవన్నీ రాజంపేట పట్టణం గుండానే వెళు తుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పాటు కాలువలను వెడల్పు చేసి పట్టణానికి తగ్గట్లుగా మురికినీరు, వర్షపునీరు, పోవడానికి పట్టణానికి తగ్గట్టు కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో వర్షాకాలంలో మురికినీరంతా రోడ్లపై ప్రవహించి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో బ్రిటీషు కాలం నుంచి బుధవారం వారాంతపు సంత జరుగుతుంది. కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు మార్కెట్ చెత్తా చెదారంతో నిండిపోయిన వీధులు దారిలోనే అడ్డంగా పెట్టుకుని వ్యాపారాలు చేయడం వల్ల మార్కెట్‌లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. మార్కెట్ లోపల కనీస సౌకర్యాలు లేకపోవడంతో దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది. కూటమి ప్రభుత్వంలోనైనా రాజంపేటను పట్టించుకుని అభివృద్ధి పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నిధుల లేమితో కుంటుపడుతున్న అభివృద్ధి
మున్సిపల్ పాలకమండలి బాధ్యతలు తీసుకున్న వెంటనే ఇతర పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేయడానికి వంద కోట్ల అభివృద్ధి ప్రణాళికలను నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించాము. నిధుల లేమి వల్ల ఆ అభివృద్ధి ప్రణాళిక ముందుకు సాగలేకపోయింది. నేను మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లలో నిధులు విడుదల కాలేదు. అనంతరం కూటమి ప్రభుత్వం రావడంతో వంద కోట్ల అభివృద్ధి ప్రణాళిక పక్కన పడిపోయింది. పట్టణంలో అభివృద్ధి పనులు చేయడానికి కృషి చేస్తున్నాం.
-పోలా శ్రీనివాసుల రెడ్డి, మున్సిపల్ చైర్మన్, రాజంపేట
పట్టణానికి తగ్గట్లుగా పనులు జరగడం లేదు
పట్టణానికి తగ్గట్లుగా రాజంపేటలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. పట్టణానికి చుట్టూ కడప, రాయచోటి, తిరుపతిలలో అభివృద్ధి జరుగుతుంటే ఇక్కడ రూపాయి అభివృద్ధి కూడా జరగలేదు. మేము నామమాత్రంగా కౌన్సిలర్లుగా ఉన్నామే తప్ప ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాం. పట్టణంలో ప్రధానంగా ప్రధాన రోడ్ల విస్తరణ, రింగ్ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ లాంటి సమస్యలను తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
-గుగ్గిళ్ల వసంత కౌన్సిలర్, బలిజపల్లి వార్డు
ఇవి కూడా చదవండి..
ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూముల రీ సర్వే చేయండి: రఘురామ
విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
Read Latest AP News And Telugu News